బిఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు
కారణం లేకుండానే అరెస్ట్ చేస్తారా..
భయంతోనే పాదయాత్రను అడ్డుకున్నారు
ఇంట్లోనే దీక్షకు దిగిన వైఎస్ షర్మిల
పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష చేస్తానని వెల్లడి
హైదరాబాద్,డిసెంబర్10(ఆంధ్రపత్రిక): ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కారణం లేకుండానే తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్నారు. తనపై వ్యక్తిగత దూషణలు చేస్తోంది టీఆర్ఎస్ నేతలన్నారు. మేము బాధితులమైతే.. మా పైనే కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా మాపై కర్ఫ్యూ ఎత్తివేసి పాదయాత్రకు అనుమతివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. పోలీసులు తమపై ఎందుకంత కక్షగట్టారని ప్రశ్నించారు. కారణం లేకుండానే తమ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులను కేసీఆర్ వాడుకుంటున్నారని విమర్శించారు. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె తననివాసంవద్ద ఆమరణ దీక్షను చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్నారని షర్మిల ఆరోపించారు. తాలిబన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలను ఎత్తిచూపినందుకే తమను నిర్భంధాలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇచ్చిన ఒక్క ఒక్కహావిూని నెరవేర్చలేదని.. కరప్షన్ కోసమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. బిడ్డ లిక్కర్, కొడుకు ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో ఉన్నది అవినీతి, స్వార్థపరులన్నారు. మిగుల బడ్జెట్ రాష్ట్రాన్ని 4లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదన్నారు. తెలంగాణను దోచుకోవడం అయిపోయింది కాబట్టే దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరాడని విమర్శించారు. తాము ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదని..టీఆర్ఎస్ నాయకులే వ్యక్తిగత దూషణలకు దిగారని ఆరోపించారు. తాను చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించి షర్మిల.. అన్నంత పని చేశారు. ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తునందుకే తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడంలేదని ఆరోపించారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే యాత్రను అడ్డుకున్నారన్నారని వైఎస్ షర్మిల అన్నారు. నిన్న ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు ఆమె దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల వద్దకు అర్ధరాత్రి సమయంలో పార్టీ మద్దతుదారుడు పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేసాడు. వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ప్రశ్నించారు. నిరవధిక దీక్షను పోలీసులు అనుకుంటున్నారని తన పార్టీ నాయకులు కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. హైకోర్టు అనుమతినిచ్చినా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదేం పాలన, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పాదయాత్రకు అనుమతినివ్వాలి.. కార్యకర్తల్ని వదిలిపెట్టాలి.. ఈ రెండే వైఎస్ షర్మిల డిమాండ్లు. వీటిపై ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించబోనని అన్నారు.