వచ్చే నెల 18 తర్వాత రెండు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని ఆక్షేపించారు.

రోజుకు 2 గంటలైనా పాల్గొనలేదు
ఆ జాబితాలో మంత్రి బుగ్గన, కొడాలి నాని
మార్చి 18 నుంచి గృహసారథులకు శిక్షణ
అనంతరం 2 నెలలు జనంలోనే ఉండాలి
సారథులు, సమన్వయకర్తలు, వలంటీర్లు..
వీరందరితో వైసీపీ బలంగా ఉంది
‘మా నమ్మకం నువ్వే జగన్’
స్టిక్కర్లు ఇంటింటికీ అంటించాలి
ఎమ్మెల్యేలతో సమీక్షలో జగన్ ఆదేశాలు
వచ్చే నెల 20 తర్వాతే అసెంబ్లీ?
అమరావతి, ఫిబ్రవరి 13 : వచ్చే నెల 18 తర్వాత రెండు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని ఆక్షేపించారు. రోజుకు కనీసం రెండు గంటలు కూడా పాల్గొనడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడప గడపకు, గృహసారథుల నియామకాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలూ గెలిచే దిశగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ రెండు నెలల పాటు ప్రజల్లోనే తిరగాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని.. వీటిని ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని.. గతంలో కంటే భిన్నంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ అవుతున్న విషయాన్ని జనానికి వివరించాలని చెప్పారు. ‘ఏ రాజకీయ పార్టీకీ లేనంతగా 5.20 లక్షల మంది గృహ సారథులు.. 45,000 మంది సచివాలయ సమన్వయకర్తలు, రెండున్నర లక్షల మంది వలంటీర్ల వ్యవస్థతో వైసీపీ బలీయంగా ఉంది. గెలుపే లక్ష్యంగా గృహసారథులను నియమించుకోవాలి. వచ్చే నెల 18 నుంచి 26వ తేదీ వరకూ వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలి. వచ్చే నెల 18, 19 తేదీల్లో వీటిలో ఎమ్మెల్యేలు తప్పకుండా పాల్గొనాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్లు అంటించాలి.
సంక్షేమ పథకాలపై కరపత్రాలతో కిట్ బ్యాగ్‌లను ప్రతి గృహసారథికీ.. వలంటీర్‌కూ.. సమన్వయకర్తకూ అందజేయాలి’ అని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల హాజరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ చిట్టాలో ప్రతిసారీ ఉన్నట్లుగానే.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని పేర్లు ఉన్నాయి. వచ్చే నెల 17వ తేదీన నిర్వహించాల్సిన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షా్‌పను మే నెలలో నిర్వహిస్తామని సీఎం చెప్పారు. టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ, అది బలపరచిన అభ్యర్థులు విజయం సాధించేలా వ్యూహాలను అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్షలో కొత్తదనం లేదని.. కొత్త విషయాలేవీ చర్చకు రాలేదని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. గడప గడపలో పాల్గొనని ఎమ్మెల్యేలపై గత సమావేశం తరహాలో హుంకరింపులు, సీట్లు ఇవ్వను పొమ్మంటూ బెదిరింపులు లేవని చెప్పారు. ఇంకొంత మంది ఇది రొటీన్ సమీక్షగా సాగిందన్నారు. అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరుగలేదు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో గృహ సారథుల శిక్షణను వచ్చే నెలకు వాయుదా వేసినందున మార్చి 20 తర్వాతే బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
మార్చిలోనే ఆసరా.. ఎన్నికల కోడ్‌తో ‘గడప’కు బ్రేక్: సీఎం
కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా రాష్ట్రమంతా శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని మార్చి 18 వరకు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కోడ్ కారణంగా ‘ఆసరా’ పథకాన్ని కూడా వచ్చే నెలకు వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఆసరా పథకం సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేసినప్పుడు.. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్లి వివరించాలని.. ఇందుకు గృహసారథులు, సచివాలయ సమన్వయకర్తలు, వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు.