వినుకొండలో ఇరు పార్టీల ఘర్షణ…
బాహాబాహీకి దిగిన టిడిపి,వైసిపి
టిడిపి నేతల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే తీరుతో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు
ఇరువర్గాల మధ్య వాదనలతో పరిస్థితి ఉద్రిక్తం
గాల్లోకి కాల్పులు జరిపిన సిఐ
పల్నాడు, జూలై 27 ( ఆంధ్రపత్రిక): మరోసారి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం రణరంగంగా మారింది. టీడీపీ`వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. పరిస్థితులను కంట్రోల్‌కి తెచ్చేందుకు సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాల య్యాయి. మరోవైపు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులకు వ్యతిరేకంగా వినుకొండ బస్టాండ్ దగ్గర తెలుగుదేశం కార్యకర్తలు నిరసన చేపట్టారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులుతో పాటు 19 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్తున్న టీడీపీ వాళ్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ వర్గీయులు జెండాలతో వచ్చారు. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో ఒక్కసారిగా వినుకొండ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదిలా ఉంటే ఇరు పార్టీల ఆందోళనలతో స్థానికులు భయాందో ళనకు గురయ్యారు. అయితే వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ముదిరిన వివాదంలో సీఐ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరపడంతో రణరంగంగా మారిందన్న విమర్శలు వచ్చాయి. వినుకొండ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని టీడీపీ శ్రేణులు ఓ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాలని పోలీసులు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యయుత నిరసనలపైనా కేసులు పెడతారా అని.. టీడీపీ నేతలు.. మరోసారి ర్యాలీ నిర్వహించారు. అయితే ఈసారి పోలీసులు కాకుండా.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదురు వచ్చారు. వినుకొండ బస్టాండ్ సెంటర్లో రెండు వర్గాలు ఎదురు పడ్డాయి. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు దిగి టీడీపీ కార్యకర్తలపై దూసుకెళ్లడంతో పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. పోలీసులు ఎమ్మెల్యేలను సర్ది చెప్పి పంపేశారు కానీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ మాత్రం ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న సమయంలో పోలీసులు తీవ్ర చర్యలకు దిగారు. సీఐ ..వెంటనే.. గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఇంటర్నెట్ నిలిపివేశారు. దాంతో ఎంత మంది గాయపడ్డారు.. పట్టణంలో ప్రశాంతత ఎలా ఉందన్నదానిపై సమాచారం బయటకు రాకుండా కట్టడి చేశారు. ఈ ఘటనలో పదిహేను మందికిపైగా టీడీపీ నేతలకు గాయాలయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉద్దేశ్య పూర్వకంగానే టీడీపీ నేతలు చేస్తున్న ర్యాలీ దగ్గరకు రెచ్చగొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన ఆవుల ఫారంకి అక్రమంగా మట్టి తరలించాలని జీవీ ఆంజనేయులు రెండు రోజుల క్రితం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఇలా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన ఆవుల ఫారం నుంచి నట్లు బోల్టులు దొంగిలించారని కేసులు పెట్టించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై శుక్రవారం ఉదయం టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహిం చాలని నిర్ణయించారు ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రాగానే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో టిడిపి ఆందోళన కారుల వద్దకు వచ్చి పరుష పదజాలంతో దూషించడమే కాక ఘర్షణ వాతావరణంలో సృష్టిం చారని అందుకే పరిస్థితి దిగజారిందని టీడీపీ నేతలు అంటున్నారు. వినుకొండలో రాను రాను రాజకీయం ఉద్రిక్తంగా మారుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. బ్రహ్మనాయుడు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాను రాను రెండు పార్టీ మధ్య ఉద్రిక్తతకు దారి తీస్తోంది. దాడుల వరకూ రావడం.. సంచలనంగామారింది