- కేంద్రమంత్రుల్లో ఇద్దరు గెలుపు, ఒకరికి ఓటమి
- రాష్ట్ర మంత్రుల్లో కొందరు పరాజయం
ఇండోర్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్నీ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో గెలుపొందారు.
ఆయన 1,04,974 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్ మస్తల్ శర్మను ఓడించారు. ఈసారి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముఖ్య నేతలు బరిలోకి దిగారు. ముగ్గురు కేంద్ర మంత్రులు సహా నలుగురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వీరిలో కొందరు గెలుపొందగా, మరికొందరు ఓడిపోయారు. పోటీ చేసిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో ఇద్దరు విజయం సాధించగా, ఒకరు ఓటమి పాలయ్యారు. వీరిలో దిమానీ నుంచి నరేంద్ర సింగ్ తోమర్, నార్సింగ్ పూర్ నుంచి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గెలవగా.. నివాస్ నుంచి బరిలోకి దిగిన ఫగ్గన్ సింగ్ కులస్తే మాత్రం ఓడిపోయారు. ఇక నలుగురు ఎంపీల్లో జబల్ పూర్ వెస్ట్ నుంచి రాకేశ్ సింగ్, గదర్వార నుంచి ఉదయ్ ప్రతాప్ సింగ్, సిద్ధి నుంచి రితి పాఠక్ గెలిచారు. సత్నా నుంచి గణేశ్ సింగ్ ఓటమి పాలయ్యారు. మరో ముఖ్య నేత కైలాశ్ విజయ్ వర్గీయ ఇండోర్-1 సీటు నుంచి గెలుపొందారు.
ఓడిన రాష్ట్ర మంత్రులు..
చౌహాన్ కేబినెట్లోని కొద్దరు మంత్రులు మాత్రం ఓటమి పాలయ్యారు. అటెర్ నుంచి అరవింద్ భడోరియా, బమూరీ నుంచి మహేంద్ర సింగ్ సిసోడియా, బద్నావర్ నుంచి రాజవర్ధన్ సింగ్ ప్రేమ్ సింగ్, దతియా నుంచి నరోత్తమ్ మిశ్రా ఓడిపోయారు. ఉజ్జయినీ సౌత్ నుంచి మోహన్ యాదవ్, నరేలా నుంచి విశ్వాస్ సారంగ్ గెలిచారు.