Chief Minister: ప్రధాని మోదీని నిలదీసిన సీఎం స్టాలిన్.. విషయమేంటో తెలిస్తే..
తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా తమ రాష్ట్రంలోని ప్రాంతాల్లోని గనులను కేంద్రప్రభుత్వం
చెన్నై, Andhrapatrika : తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా తమ రాష్ట్రంలోని ప్రాంతాల్లోని గనులను కేంద్రప్రభుత్వం ఎలా వేలం వేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిలదీశారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష ధోరణి దురదృష్టకరమని నిష్టూరమాడారు. ఆహారోత్పత్తి ప్రాంతమైన కావేరీ డెల్టా ప్రాంతంలో బొగ్గును వేలం వేస్తున్నట్లు ప్రకటించడం సరి కాదన్నారు. ఈ మేరకు స్టాలిన్ మంగళవారం ప్రధానమంత్రికి లేఖ రాశారు. దేశంలోని 101 ప్రాంతాల్లో వున్న బొగ్గు గనుల్ని వేలం వేస్తూ గత నెల 29వ తేదీన కేంద్ర బొగ్గుశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని సీఎం గుర్తు చేశారు. ఆ 101 ప్రాంతాల్లో అరియలూరు జిల్లా మైఖేల్పట్టి, కడలూరు జిల్లా చెట్టియాతోపు తూర్పు, తంజావూరు జిల్లా వడసేరి ప్రాంతాలు కూడా వున్నాయన్నారు. కావేరీ డెల్టా(Kaveri Delta)లో వున్న ఈ మూడు ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి అని వివరించారు. ఇందులో వడసేరి, చెట్టియాతోపు ప్రాంతాలు అగ్రికల్చరల్ జోన్ డెవల్‌పమెంట్ యాక్ట్ 2020 ప్రకారం రక్షిత వ్యవసాయ జోన్ పరిధిలోకి వస్తాయన్నారు. అదే సమయంలో మైఖేల్పట్టి కావేరి డెల్టాలోని అత్యంత సారవంతమైన ప్రాంతంగా, భారీగా వరి పండించే ప్రాంతంగా ఉందని గుర్తు చేశారు. రక్షిత వ్యవసాయ జోన్లో వున్న చోట ఎలాంటి కొత్త ప్రాజెక్టు లేదా కొత్త కార్యాచరణను చేపట్టకూడదని చట్టంలోనే ఉందన్నారు. అందువల్ల అవి తమిళనాడు రక్షిత వ్యవసాయ మండల అభివృద్ధి చట్టం 2020 మేరకు నిషేధిత ప్రాంతాలన్నారు. కాబట్టి ఈ వేలం నోటిఫికేషన్ అమలులోకి వచ్చినా, టెండర్లు పిలిచినా ఇక్కడ ఎలాంటి మైనింగ్ ప్రాజెక్టును చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అందువల్ల ఈ వేలం ప్రక్రియ నిష్ఫలమైన కసరత్తు అని తేల్చి చెప్పారు.
కేంద్ర బొగ్గుశాఖ వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించకముందు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం పొందలేదని, కనీసం తమ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదన్నారు. ఇంతటి ముఖ్యమైన విషయంలో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా బొగ్గు మంత్రిత్వశాఖ ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. తమిళనాడు(Tamil Nadu)లో గుర్తించిన ప్రాంతాలకు సంబంధించి నంత వరకు నోటిఫికేషన్ జారీ చేసే ముందు తమను సంప్రదించి, ఈ అంశాలపై స్పష్టతనిచ్చి వేలం నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే అనవసరమైన గందరగోళాన్ని నివారించి ఉండేవారమన్నారు. ఇప్పటికైనా ఆహారోత్పత్తి ప్రాంతాలైన ఈ మూడింటినీ వేలం నుంచి మినహాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేగాక భవిష్యత్తులో కేంద్రప్రభుత్వం బహిరంగ ప్రకటనలు జారీ చేసే ముందు రాష్ట్రప్రభుత్వ శాఖాలతో సంప్రదించాలని సూచించారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటన వల్ల ఏర్పడిన గందరగోళ, అనవసర నిరసన పరస్థితిని చక్కదిద్దాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సీఎం తన లేఖలో కోరారు.