- తొలుత 300 ఔషధాలపై ఈ క్యూఆర్ కోడ్లను ముద్రించేందుకు ప్రభుత్వం యోచన
- రూ.100 కంటే ఎక్కువ విలువైన ఔషధాలపై తొలి దశలో క్యూఆర్ కోడ్
- బీపీ, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్ ఔషధాలను తయారుచేసే కంపెనీలకు క్యూఆర్ కోడ్ ముద్రణ తప్పనిసరి.
న్యూధిల్లీ,అక్టోబరు3 (ఆంధ్రపత్రిక): దేశంలో నకిలీ మందుల బెడదను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. బహిరంగ మార్కెట్లోకి వస్తున్న మందులపై ఇకపై క్యూఆర్ కోడ్ ముద్రణను తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వినియోగదారులు అవి అసలైనవా, నకిలీవా గుర్తించేందుకు వీలు పడుతుంది. ఔషధాలు ప్యాక్‌చేసే బాటిల్స్, జార్, ట్యూబ్, స్ట్రిప్‌లపై ఈ క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు. తొలుత 300 ఔషధాలపై ఈ క్యూఆర్ కోడ్లను ముద్రించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిసింది. రూ.100 కంటే ఎక్కువ విలువైన ఔషధాలపై తొలి దశలో క్యూఆర్ కోడ్ ముద్రించి.. అనంతరం మిగిలిన మందులకూ విస్తరించాలని భావిస్తోంది. ముఖ్యంగా విస్తృత్తంగా వినియోగించే బీపీ, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్ ఔషధాలను తయారుచేసే కంపెనీలకు క్యూఆర్ కోడ్ ముద్రణను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పలు చోట్ల ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ మందులను విక్రయిస్తున్న ఉందతాలు బయటకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్‌తో పాటు వినియోగదారుల కోసం ఓ పోర్టల్‌ను కూడా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రారంభించబోతోందని తెలుస్తోంది. ఈ పోర్టల్‌లో మందులపై ఉన్న ప్రత్యేకమైన కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా కూడా నకిలీలను గుర్తించే వెసులుబాటును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విధానం అమలు చేస్తే ఔషధాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశమూ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.