Chandrayaan-3: జాబిల్లి కథలో మహిళాయాన్!
చంద్రుడి మీద అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన ‘చంద్రయాన్-3’ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరి… మన శాస్త్రవేత్తల ఘనతను సమున్నతంగా నిలిపింది.


వనిత… ఒక చరిత్ర
ఇస్రోలో రీతూ లాంటి ఎందరికో మార్గదర్శిగా నిలిచిన మహిళ ముత్తయ్య వనిత. ఆ సంస్థలో తొలి మహిళా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆమె చరిత్రలో తనదైన స్థానం సంపాదించుకున్నారు.. చెన్నైకి చెందిన వనిత డిజైన్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇస్రోలో జూనియర్ ఇంజనీర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. వివిధ విభాగాల్లో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగారు. ‘కార్టోశాట్-1, ఓషన్‌శాట్-2’ తదితర అనేక ప్రాజెక్టుల్లో పని చేశారు. ఉపగ్రహాల తయారీలో మేటిగా గుర్తింపు పొందారు. డేటా నిర్వహణలో నైపుణ్యం, డిజిటల్, హార్డ్‌వేర్‌కు సంబంధించిన అంశాల్లో అపారమైన పరిజ్ఞానం సీనియర్లను ఆకర్షించాయి. ‘చంద్రయాన్-1’కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్ ఎం. అన్నాదురై… ‘చంద్రయాన్-2’కు ఆ పదవి కోసం ఆమె పేరు సిఫార్స్ చేశారు. అయితే వనిత ఆ బాధ్యతలు చేపట్టడానికి మొదట ఒప్పుకోలేదు. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా రోజూ పద్దెనిమిది గంటల సేపు పని చేయాల్సి రావడమే కాదు, అనేక త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. దేశం ఆకాంక్షలను మోయాల్సి రావడం ఒత్తిడిని మరింత పెంచుతుంది. అందుకే ఆమె సంకోచించారు. కానీ సమస్యల పరిష్కారంలో, టీమ్ మేనేజిమెంట్‌లో అద్భుతమైన నైపుణ్యాలున్న వనిత ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరని డాక్టర్ అన్నాదురై నమ్మారు. చివరకు ఆమెను ఒప్పించారు. ‘‘నా తల్లితండ్రులిద్దరూ ఇంజనీర్లు. వారిని చూస్తూ పెరిగాను. పని ఎంత చిన్నదయినా దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. దానివల్ల ఎల్లప్పుడూ మంచి ఫలితాలు లభిస్తాయని వారి నుంచి నేర్చుకున్నాను.
‘చంద్రయాన్-2’ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చినప్పుడు. మొదట్లో సందేహించాను. కానీ తరువాత దాన్ని సవాల్‌గా తీసుకున్నాను. జీవితం మన మీద సవాళ్ళు విసిరినప్పుడు, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కూడా అదే ఇస్తుంది. ఆ సవాల్‌ను నేను ఎంతగానో ఆస్వాదించాను’’ అని చెబుతారు వనిత. వృత్తి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆమె తాజా ‘చంద్రయాన్-3’లోనూ కీలక పాత్ర పోషించారు. 2006లో అస్ట్రనామికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమన్ సైంటిస్ట్ అవార్డు, సత్య సాయి సేవా ట్రస్ట్ నుంచి ఈశ్వరమ్మ అవార్డుతో సహా పలు పురస్కారాలను అందుకున్నారు. ‘‘నాకు వంట పని ఇష్టం. కేక్స్ చేస్తాను, కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తాను. మా ఇంట్లోనే పూల మొక్కలతో పాటు, అల్లం, కొత్తిమీర లాంటివి పెంచుతూ ఉంటాను. జీవితమంటే లక్ష్యాలు నిర్దేశించుకోవడమే కాదు, సేద తీరడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికీ కూడా సమయం కేటాయించాలి’’ అని యువతకు ఒక సందర్భంలో ఆమె సూచించారు. ‘‘దేశ ప్రతిష్టను పెంచే ప్రాజెక్టుల్లో పని చేయడం కన్నా సంతృప్తి మరేదీ ఉండదు’’ అంటున్న వనిత మహిళాలోకానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.
నింగిని తాకి, నిజమైన కల…
పిల్లలు తమ అభిమాన నటులు, క్రీడాకారుల ఫొటోలు సేకరించి, అపురూపంగా దాచుకొనే వయసది. కానీ రీతూ కరిథాల్ చూపు ఎప్పుడూ ఆకాశంవైపే. పాఠశాల విద్యార్థినిగా ఉన్న రోజుల్లో ‘ఇస్రో’, అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ నిర్వహించే అంతరిక్ష కార్యకలాపాల గురించి వచ్చిన వార్తా కథనాల్ని సేకరించి దాచుకోవడం ఆమె ప్రధానమైన అభిరుచి. అవి ఇప్పటికీ ఆమె దగ్గర భద్రంగా ఉన్నాయి. లక్నోలో పుట్టి పెరిగిన రీతూ అక్కడే బిఎస్సీ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ‘‘మాది మధ్యతరగతి కుటుంబం. అప్పట్లో మాకు ట్యూషన్లు, కోచింగ్ ఇనిస్టిట్యూట్ల లాంటివి ఉండేవి కావు. కానీ బాగా చదువుకోవాలనే తపన నాలో రగిలించింది మా అమ్మా నాన్నా’’ అని ఆమె చెప్పారు. ఆకాశమంటే రీతూకి ఎందుకింత ఇష్టం? ‘‘అంతరిక్షంలోని మిస్టరీల గురించి తెలుసుకోవాలనే తపన చిన్నప్పటి నుంచీ ఉండేది.
రాత్రి ఆకాశంవైపు చూస్తున్నప్పుడు… ‘చంద్రుడు ఎందుకు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాడు? అంతులేని ఆ చీకట్ల వెనుక ఏముంది?’ అనే ప్రశ్నలు నన్ను నిలువనిచ్చేవి కావు. సైన్స్ నాకొక సబ్జెక్ట్ కాదు, ఉద్వేగాన్ని కలిగించే విషయం’’ అంటారామె. అందుకే ఇస్రోలో ఉద్యోగాల గురించి ప్రకటన చూడగానే వేరే ఆలోచన లేకుండా దరఖాస్తు చేశారు. ‘‘నా జీవితంలో అత్యుత్తమమైన క్షణం… ఉద్యోగంలో చేరాలంటూ ఇస్రో నుంచి పిలుపు రావడం. అది 1997. చాలామంది మహిళలు కెరీర్‌నీ, ఇంటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టపడుతున్న సమయం అది. నేను చేరినప్పుడు ఇస్రోలో ఎక్కువమంది మహిళలు ఉండేవారు కాదు. అయితే, మహిళనని నన్ను తక్కువ చేసి చూడడం, వివక్ష ప్రదర్శించడం లాంటివి ఎప్పుడూ లేవు. ఇక్కడ మీరు ఎలా, ఎంత నాణ్యతతో పని చేస్తారనేదే ప్రధానం’’ అంటారు రీతూ. ఇస్రోలోని మిషన్ అనాలసిస్ డివిజన్లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె వివిధ ప్రాజెక్టుల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. 2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా ‘ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు అందుకున్నారు.
అంగారక గ్రహం మీద పరిశోధనల కోసం మన దేశం చేపట్టిన ‘మిషన్ మంగళ్యాన్’కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ‘‘మంగళ్యాన్కు పని చేసిన పద్ధెనిమిది నెలలూ ఎంతో ఒత్తిడి ఉండేది. తెల్లవారుజాము నాలుగు గంటల వరకూ పని చేసేదాన్ని. అప్పట్లో నా పిల్లలిద్దరూ చాలా చిన్న వాళ్ళు. కానీ నా వృత్తి బాధ్యతలు ఎలాంటివో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇల్లు, పిల్లల విషయంలో నా భర్త అవినాష్ శ్రీవాత్సవ ఎంతో అండగా ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యపడ్డాయి. ఇస్రోలో అనేక ముఖ్యమైన ప్రాజెక్టులకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. కానీ మంగళయాన్ అన్నిటికన్నా ప్రత్యేకం. అది నా ఆకాంక్షలెన్నిటినో నెరవేర్చింది’’ అంటారామె. ఆ ప్రాజెక్ట్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. పలు సంస్థలు ఆమె కృషిని గుర్తించి సత్కరించాయి. ఆ తరువాత 2019లో ‘చంద్రయాన్-2’ను మిషన్ డెరెక్టర్‌గా ఆమె పర్యవేక్షించారు. ఇప్పుడు ‘చంద్రయాన్-3’కి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించి… మరోసారి వార్తల్లో నిలిచారు. ‘రాకెట్ ఉమన్ ఆఫ్ ఇండియా’గా ప్రశంసలు పొందుతున్నారు. ఇస్రో టీమ్ అవార్డ్, ఎఎ్‌సఐ టీమ్ అవార్డ్, ‘సొసైటీ ఫర్ ఇండియా ఏరోస్పేస్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీస్’ నుంచి ఏరోస్పేస్ ఉమన్ అవార్డ్… ఇలా ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు.