తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీల కంటే సీఎం కేసీఆర్ ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలంగాణలో అధికారం పై కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ సమయంలోనే తెలంగాణలో టీడీపీ పోటీ పైన సందిగ్ధత కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్..తరువాతి పరిణామాల మధ్య చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు రేవంత్ పైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.
హోరా హోరీ రాజకీయం:తెలంగాణ ఎన్నికల రాజకీయం హోరా హోరీగా సాగుతోంది. తెలంగాణలో ఎన్నికల్లో ఈ సారి చంద్రబాబు అరెస్ట్ అంశం చర్చక కారణమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో నిరసనల సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కొందరు టీడీపీ సానుభూతి పరులు..టీడీపీకి మద్దతుగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గం నేతలు మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటనలు చేసారు. ఎన్నికల్లో తమ వైఖరి గురించి వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ నేతలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను లోకేష్ కలిసారు. చంద్రబాబు అరెస్ట్ గురించి ఫిర్యాదు చేసారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణల కారణంగానే ఈ మీటింగ్ జరిగిందని..తెలంగాణ ఓటింగ్ సమీకరణాలలో ఈ భేటీ ఖాయమైందనే ప్రచారం ఉంది.
మారుతున్న లెక్కలు:ఇక, తెలంగాణ లో బీజేపీ, టీడీపీ పొత్త పైన చాలా రోజులుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు, ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయటం ద్వారా జగన్ ను ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యం. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుకు ససేమిరా అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జనసేన 32 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించింది. కానీ, అభ్యర్దులు..మేనిఫెస్టో పై మాత్రం చర్చ లేదు.
అటు టీడీపీ అధినేత జైలులో ఉండటంతో తెలంగాణలో పోటీ పైన సందిగ్ఢత కొనసాగుతోంది. ఏపీలో అధికారమే టీడీపీకి ఇప్పుడు ప్రధాన లక్ష్యం. దీంతో, టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే ఏంటి ప్రయోజనం..పోటీ చేయకపోతే ఎలాంటి ప్రభావం ఉంటుందనే తర్జన భర్జన పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పై టీడీపీ నిర్ణయ ప్రభావం:తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓట్లలో చీలిక వస్తుందనే అభిప్రాయం ఉంది. బీజేపీతో పొత్తుతో వెళ్తే ఏపీలోనూ కలిసి వస్తుందనే లెక్కలు ఉన్నా, అందుకు అనుగుణంగా పరిస్థితులు కనిపించటం లేదు. ఇక, టీడీపీలో గతంలో పని చేసి..ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ కు మద్దతిస్తామని కొందరు టీడీపీ సానుభూతి పరులు ఓపెన్ గా నే మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు.
ఇదే ఇప్పుడు టీడీపీకి సమస్యగా మారుతోంది. సింగిల్ గా పోటీ చేస్తే బీజేపీ ఓట్లు చీల్చారనే ప్రచారం..పోటీ చేయకపోతే కాంగ్రెస్ కు సహకరించారనే వాదన ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, టీడీపీ ఈ సారి ఎన్నికల్లొ పోటీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కవ ఉన్నాయని పార్టీ నేతల సమాచారం.
అయితే, ఈ వారంలోనే అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. టీడీపీ పోటీలో ఉంటే కాంగ్రెస్ కు కొన్ని నియోజకవర్గాల్లో నష్టం చేస్తుందనే అభిప్రాయం ఉంది. దీంతో..చంద్రబాబు నిర్ణయం..కాంగ్రెస్ పై ప్రభావం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.