Chandrababu : ఏడాదంతా జనంలోనే!
నేటి నుంచి ఏడాది కాలం పాటు ప్రజల మధ్యే తిరగాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.
జగన్ అరాచకాలపై విస్తృత ప్రచారం
టీడీపీ నేతలు, శ్రేణులకు చంద్రబాబు సూచన
నాలుగేళ్లుగా పేదల రక్తం తాగుతున్న జగన్
రైతుల ఆత్మహత్యల్లో మనది మూడోస్థానం
సాగు మీటర్లతో వారి మెడలకు ఉరితాళ్లు
మద్య నిషేధం హామీ ఇచ్చి లిక్కర్‌పైనే అప్పు
పోలవరాన్ని పూర్తిచేసే చాన్స్ చెడగొట్టారు
రాష్ట్రంలో గంజాయి.. గన్ కల్చర్ తెచ్చారు
నాడు ‘వైనాట్ కుప్పం’ అన్నారు..
మేం ‘వైనాట్ పులివెందుల’ అంటున్నాం
కుప్పంలో మా మెజారిటీ లక్ష
నెల్లూరు జోన్ సమావేశంలో బాబు
నాలుగేళ్లపాటు అన్ని వర్గాల వారినీ వేధించుకు తిన్న జగన్.. ఇప్పుడు నేను మీ బిడ్డనంటూ కపట నాటకం మొదలుపెట్టారు. ఆయన రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం.
ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులుంటే సగటున ఒక్కొక్కరి తలపై 2 లక్షల చొప్పున రూ.10 లక్షల అప్పుల భారం మోపిన జగన్.. రాష్ట్రానికి పుట్టిన కేన్సర్ గడ్డ కాక మరేమవుతారు?
– చంద్రబాబు
నెల్లూరు, ఏప్రిల్ 7 (Andhrapatrika) ; నేటి నుంచి ఏడాది కాలం పాటు ప్రజల మధ్యే తిరగాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపిచ్చారు. టీడీపీ నాలుగో జోన్ (ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు) పరిధిలోని 35 నియోజకవర్గాలన్నిటిలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని, ప్రతి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరేలా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ‘జగన్ ప్రజల బిడ్డ కాదు.. రాష్ట్రానికి పుట్టిన కేన్సర్ గడ్డ. కేన్సర్ గడ్డ చిన్నదైనా పెద్దదైనా వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే. లేదంటే రాష్ట్రం సర్వనాశనమవుతుంది’ అని స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులో జరిగిన నాలుగో జోన్ సమీక్ష సమావేశంలో.. రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతిరూపమైన జీసస్ దీవెనలు వారికి ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ కళ్లు ఇప్పుడిప్పుడే భూమ్మీదకు దిగుతున్నాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. ప్రజ లు ఆయన్ను ఇంకా కిందకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నాలుగేళ్ల జగన్ పాలనలో ఏ వర్గమూ బాగుపడలేదన్నారు. మీ జీవితాలు బాగుపడ్డాయో.. ముందు కన్నా హీనంగా తయారయ్యాయో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. జగన్ పాలనలో గంజాయి కల్చర్, గన్ సంస్కృతి పెరిగిపోయిందని..
అందుకే ఈయన రాష్ట్రానికి కేన్సర్ గడ్డ అని అంటున్నానని తెలిపారు. మద్యం ధరలు పెరిగిపోవడంతో కొనే శక్తిలేక ప్రజలు గంజాయికి బానిసలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగేళ్లుగా పేదల రక్తం తాగుతున్నారని.. వారు ఆరోగ్యాలు దెబ్బతిని కూలి చేసుకునే శక్తి కూడా లేని బలహీనులుగా తయారవుతుంటే వైసీపీ నాయకులు వారి పొలాల్లో గంజాయి పంట పండిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం పెట్టిన చేతకాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ‘మద్య నిషేధం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా మద్యం మీద అప్పుతీసుకొచ్చిన ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని రాష్ట్రానికి పట్టిన దరిద్రమనకుండా మరేమనాలి? రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది. ఇది చాలదన్నట్లు రైతుల మెడలో ఉరితాళ్లుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్న ఈ ముఖ్యమంత్రిని, ఇదేమని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్న ఈ ముఖ్యమంత్రిని రాష్ట్రానికి పుట్టిన కేన్సర్ గడ్డ కాక మరేమంటాం? టీడీపీ ప్రభుత్వం రూ.64 వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది. 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. మిగిలినవి దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశాం. పోలవరం పూర్తి చేసి కరువులేని రాష్ట్రంగా తీర్చిదిద్దే సువర్ణ అవకాశాన్ని చెడగొట్టిన వ్యక్తి జగన్. అందుకే ఇతను రాష్ట్రానికి కేన్సర్ గడ్డ అంటున్నాను’ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
అందరినీ భయపెడుతున్నారు!
రాష్ట్రంలో అన్ని వర్గాలనూ భయానికి గురి చేస్తున్నారు. ప్రశ్నించిన పత్రికలపై దాడులు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. విలేకరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో 22ఏ పెడతారు. వివాదాలు సృష్టిస్తారు. చౌకగా ఆ భూమిని వైసీపీ వాళ్లే కొట్టేస్తారు. ఒక్క విశాఖలోనే రూ.40వేల కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేశారు. నెల్లూరు జిల్లాలో గెలాక్సీ, సిలికా ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఒక్క సిలికా ద్వారానే వందల కోట్ల అవినీతి జరిగింది. స్వర్ణముఖి ఇసుక ఎక్కడికి పోతోంది? చెన్నై, బెంగళూరు నగరాలకు ఎవరు సప్లయ్ చేస్తున్నారు? వీటికి సమాధానం చెప్పే ధైర్యం జగన్కుందా? 2014 ఎన్నికల సందర్భంగా గోవా మద్యం అమ్మిన దౌర్భాగ్యపు వ్యక్తి ఇప్పుడు మంత్రి అయ్యాడు. కోర్టులో ఫైళ్లు మాయం చేసిన దొంగ కూడా మాట్లాడుతున్నాడు, ఇలాంటిఅవినీతి పరులను పెంచి పోషిస్తున్నందుకే జగన్ ఈ రాష్ట్రానికి కేన్సర్ గడ్డ. వీరిని హెచ్చరిస్తున్నా.. ఈ అవినీతి పరులను వదిలిపెట్టను. అందరినీ బోనెక్కిస్తా!
కుప్పం మెజారిటీ లక్ష
మొన్నటి వరకు ‘వైనాట్ కుప్పం’ అన్నారు. ఇప్పుడు చెబుతున్నా.. కుప్పంలో మా మెజారిటీ లక్ష. ఎమ్మెల్సీ ఫలితాలతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ‘వైనాట్ పులివెందుల..’ ఇదీ సీను. మనం వలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఆ విషయం వారికి వివరించండి. వారితో మాట్లాడండి. అయితే వైసీపీ నాయకుల సేవలో తప్పులు చేస్తే మాత్రం ఉపేక్షించబోమని చెప్పండి.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: అచ్చెన్న
ఎన్నికలు ఎప్పుడొచ్చినా నాయకులంతా సిద్ధంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
బాబు సెల్ఫీ చాలెంజ్!
తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో గృహసముదాయాల వద్దకు వెళ్లి చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోతో సభా వేదికపై నుంచి సెల్ఫీ చాలెంజ్ వదిలారు. ‘జగన్.. నువ్వు నిజమైన పేదల మనిషివే అయితే ఈ ఇళ్లు ఎందుకు పంచలేదో చెప్పాలి. తెలుగుదేశం హయాంలో పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహా ఇళ్లు ఇవ్వాలని 11 లక్షల గృహాలు నిర్మించాం. వాటిలో 2.50 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా వీటిని పేదలకు ఇవ్వడానికి ఎందుకు మనసు రావడం లేదో చెప్పాలి’ అని సవాల్ విసిరారు. వీటిని ఎందుకు ప్రజలకు ఇవ్వడం లేదో కారణం చెప్పమని సెల్ఫీ ఫొటోలు తీసి జగన్‌కు పెట్టండి.
ట్విటర్లోనూ చాలెంజ్..
అమరావతి: నెల్లూరు టిడ్కో ఇళ్లపై ట్విటర్లోనూ చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ‘మేం కట్టిన ఇళ్లు ఇవి. నేను సెల్ఫీ దిగి చాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి చేతనైతే తాను కట్టిన ఇళ్ల ముందు సెల్ఫీ దిగి చూపించాలి’ అని ట్వీట్ చేశారు.