స్కిల్ స్కామ్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అటు బాబు ఫైబర్‌నెట్ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక 20 రోజుల తర్వాత నారా లోకేష్ రాజమండ్రికి వస్తున్నారు. ఆయన ఏం చేయబోతున్నారు..?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు మరో దఫా రిమాండ్ పొడిగించింది. ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండో దఫా విధించిన గడువు గురువారం ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ను రెండు వారాల పాటు పొగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు స్కిల్ స్కామ్ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
విచారణ శుక్రవారానికి వాయిదా
స్కిల్ కేసుతో చంద్రబాబుకు సంబంధంలేదని ప్రమోద్‌కుమార్ దూబే వాదించారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారని కోర్టుకు వివరించారు. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారన్నారు. ఇందులో స్కామ్ ఎక్కడుంది..? చంద్రబాబు పాత్ర ఏముంది..? ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని దూబే వాదనలు వినిపించారు. స్కిల్ కేసు ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయని సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉందని చెబుతూ, కస్టడీకి ఇవ్వాలని కోరారు.ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఫైబర్‌నెట్ కేసులో తీర్పు రిజర్వ్..
ఇక ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేశ్..
20 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి విచ్చేసిన టీడీపీనేత నారా లోకేశ్ , శుక్రవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అవుతారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కూడా చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది.