టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు..సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆపై చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆపై చంద్రబాబు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. రేపు సింహాచలం వెళ్లి అప్పన్న స్వామి దర్శించుకోనున్నారు. ఆపై డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తారు. అలాగే రానున్న రోజుల్లో కడప దర్గా, గుణదల మేరీ మాత చర్చిలకు వెళ్తానన్నారు.
ఈనెల 10వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారైంది. రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ పర్యటన చేపట్టడంపై కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపలో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఆహ్వానం అందించనున్నారు. పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు చంద్రబాబు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం కడప పెద్ద దర్గా కు కూడా వెళతాను అని తెలిపారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని భగవంతుడిని కోరినట్లు చెప్పారు. నా శేష జీవితం ప్రజలకు అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతాం.. ఇబ్బంది పెడితే మర్చిపోం అన్నారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారు. నా బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేసారని గతంలో జరిగి విషయాలను గుర్తుచేశారు. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడమని కోరుతూ దర్శనం చేసుకున్నా. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని వేడుకున్నట్లు తెలిపారు. నా కష్టంలో భారతీయులంతా స్పందించారు.. విదేశాల్లో సైతం నాకోసం ప్రార్ధనలు చేశారన్నారు. అధర్మం వైపు వెళ్తే రాష్ట్రమే అంధకారంలోకి వెళ్తుందని హితపూరిత వ్యాఖ్యలు చేశారు.