- ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
- భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
- ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు అధికారులు
- ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది, సామాగ్రి తరలింపు
- భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
- విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ బలగాలు
నల్గొండ,నవంబర్ 2 (ఆంధ్రపత్రిక): నేటి మునుగోడు ఉప ఎన్నికకు అంతా సిద్దం అయ్యింది. అధికారులు ఏర్పట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్దంది తమకు కేటాయించిన సామాగ్రితో ప్రత్యేక బస్సుల్లో బయలు ఆయా కేంద్రాలకు దేరారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూర్లోని డాన్ బాస్కో జూనియర్ కాలేజీలో డిస్టిబ్యూష్రన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది అక్కడకు వచ్చి పోలింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. మెటీరియల్ తీసుకున్న అనంతరం కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వారిని పంపుతున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారంఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీల విషయానికొస్తే బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు. మునుగోడు పరిధిలో 2,41,855మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించు కునేందుకు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 3,366 మంది పోలీస్ సిబ్బందితో పాటు.. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు. మునుగోడులో ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ పూర్తికాగా.. ఎలక్షన్ కమిషన్ ఆన్ లైన్లోనూ వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.ప్రచారం ముగియడంతో బుధవారం స్థానిక నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కరపత్రాలు పట్టుకుని తమ పార్టీకే ఓటేయాలని కోరుతున్నారు. దీంతో అసలు సిసలు ప్రచారానికి రంగం సిద్ధమైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాల పంపిణీ మొదలయ్యింది. నోటా కలిపి ఒక్కో ఈవీఎంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. ఇందుకోసం 1,192 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండే అవసరాలతో పాటు 10 శాతం అదనంగా సిద్ధం చేసి ఉంచారు అధికారులు. మునుగోడు నియోజకర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5,685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3,366 పోలీస్ సిబ్బందితో పాటు.. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో బయటవారు ఉండకుండా ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నియోజకవర్గ సరిహద్దుల్లో 100 చెక్ పోస్టులు చేశారు. ఎన్నికలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఎస్ఎంఎస్లపై నిషేధం విధించడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుంది. మండలానికి రెండు చొప్పున 14 ప్లయింగ్ స్క్వాడ్స్, 14 స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు, మరో 14 వీఎస్టీ బృందాలు పని చేయనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పర్యవేక్షణ కోసం 7 మండలాలు, 2 మున్సిపాల్టీలకు ఒకటి చొప్పున తొమ్మిది బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం 51 బృందాలు పర్యవేక్షణలో ఉండనున్నాయి. ప్రలోభాల పర్వాన్ని నిరోధించేందుకు ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఏడు మంది ఐటీ ఆధికారుల నేతృత్వంలో బృందాలు, జిఎస్టి బృందాలు మునుగోడులో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తనిఖీలు చేస్తున్నాయి. డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.