- మంటలు అంటుకుని 11మంది దుర్మరణం
- మృతుల్లో ఒక చిన్నారి
- గాయపడిన వారి మెడికల్ ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందన్న అధికారులు
- మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా
ముంబై,అక్టోబర్ 8 (ఆంధ్రపత్రిక): మహారాష్ట్రలోని నాసిక్ వద్ద బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 11మంది దుర్మరణం పాలయ్యారని, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. యవాత్మల్ నుంచి ముంబై వస్తున్న ఒక బస్సు, నాసిక్ నుంచి పూణెళి వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో బస్సు మంటల బారిన పడిరదని, ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు సజీవదహనం కాగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు మాట్లాడుతూ.. ’ఈ రోడ్డులో భారీ వాహనాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. బస్సుకు నిప్పు అంటుకున్న తర్వాత కొందరు ప్రయాణికులు మంటల్లో కాలిపోవడం చూశాను. కానీ మేం ఏమీ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత కాసేపటికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు’ అని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి మెడికల్ ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలిపారు. అలాగే మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు.