పాకిస్తాన్ లో బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలు సహా 20 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రావల్పిండి నుంచి గిల్గిట్ పాకిస్తాన్ వైపు వెళ్తుండగా డయామర్ జిల్లాలోని కారకోరం హైవే పై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అనంతరం బస్సు అదుపుతప్పి లోయలో పడిందన్నారు. ఘటనాస్థలంలో ముమ్మరంగా సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 15 మంది క్షతగాత్రులను చిలాస్ లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై గిల్టిట్ బాల్టిస్టాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటన తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్టిట్ బాల్టిస్టాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ తెలిపారు.