హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పామ్ కాల్స్ కట్టడికి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ ఆధారిత సాంకేతికతను త్వరలో వినియోగించనుంది.
‘ఈ టెక్నాలజీ తుది దశలో ఉంది. స్పామ్లు మిమ్మల్ని చేరుకోవడానికి ముందే వాటిని గుర్తించి, తటస్థీకరించి, తొలగించడానికి ఇది రూపొందింది’ అని ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ట్వీట్ చేసింది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 15-18 మధ్య జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఈ పరిష్కారాన్ని బీఎస్ఎన్ఎల్ పరిచయం చేయనుంది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను నిలువరించే టెక్నాలజీని ఈ నెల 25న ఎయిర్టెల్ ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పెరుగుతున్న అయాచిత వాణిజ్య సమాచార మార్పిడి ముప్పును అరికట్టడానికి టెల్కోలు కఠిన చర్యలు తీసుకోవాలని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.