BRS Manifesto: ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో అన్ని పార్టీలు హామీలపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించింది. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డుపై మోదీ ఇచ్చిన హామీలతో..
ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో అన్ని పార్టీలు హామీలపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించింది. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డుపై మోదీ ఇచ్చిన హామీలతో బీజేపీ జోష్‌లో వుంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ కూడా ఎన్నికల హామీలపై ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. విపక్షాల మైండ్ బ్లాంకయ్యేలా తమ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీష్‌రావు ఇప్పటికే ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. కల్యాణలక్ష్మి నుంచి మొదలుపెడితే రైతుబంధు వరకు వివిధ పథకాలను అనేక రాష్ట్రాలు కాపీ కొట్టాయి. కానీ.. అన్ని వర్గాలకు ప్రత్యేక పథకాలు పెట్టిన కేసీఆర్.. మహిళల కోసం ఎలాంటి స్కీం ప్రవేశపెట్టలేదు. అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ మహిళలే టార్గెట్‌గా ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నాయి. దాంతో.. బీఆర్ఎస్ కూడా మహిళల కోసం బంపర్ బోనంజా ప్రకటించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇతర పార్టీల కంటే భిన్నంగా ప్రతిపక్ష పార్టీల హామీలను తలదన్నేలా కేసీఆర్ భారీ కసరత్తే చేస్తున్నారని చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో 64 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. మహిళా ఓటర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీ విజయం ఖాయం. దాంతో.. నెలనెలా మహిళల కోసం డైరెక్ట్ మనీ ఇవ్వడమా?.. మహిళలకు ఒక్కొక్కరికి లక్షో, రెండు లక్షలో వడ్డీ లేని రుణం ఇవ్వడమా?.. లేక రుణంగా కాకుండా దళిత బంధు, బీసీబంధు తరహాలో ప్రభుత్వ సాయంగా ఇవ్వడమా? అనే దానిపైనా కసరత్తు చేస్తున్నట్లు బీఆర్ఎస్లో టాక్ నడుస్తోంది. మొత్తంగా.. మహిళల కోసం కేసీఆర్ ఎలాంటి స్కీమ్ తీసుకొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.