Cyber Crime: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చాలా రకాల అవసరాలు స్మార్ట్‌ఫోన్‌తో ముడిపడి ఉంటున్నాయి.
సెన్సిటివ్, ఫైనాన్షియల్ యూజర్ డేటా(User Date) ఫోన్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఈ డేటాను దుర్వినియోగం చేయడం ద్వారా ఆన్లైన్ (Online)మోసగాళ్లు బాధితుల డబ్బు కాజేస్తున్నారు. ప్రస్తుతం చాలా రకాల స్కామ్‌లు మొబైల్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆన్లైన్ మోసాలకు వినియోగించిన 20 ఫోన్లను ప్రభుత్వం బ్లాక్ చేసింది.
* సర్కారు నిర్ణయం..
కమ్యూనికేషన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు ఉపయోగించిన అనేక మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసినట్లు మంగళవారం తెలిపింది. 20 మొబైల్ హ్యాండ్సెట్లను కూడా బ్లాక్ చేసింది. ఈ వివరాలను X ప్లాట్ఫామ్లో డిపార్ట్మెంట్ వెల్లడించింది.
* ఓ యూజర్ పోస్టుకు రెస్పాన్స్
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అదితి చోప్రా Xలో తనకు ఎదురైన ఫైనాన్షియల్ స్కామ్ గురించి వివరించారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తాజా చర్యలు తీసుకుంది. తన విషయంలో గందరగోళాన్ని సృష్టించడానికి, డబ్బు దొంగిలించడానికి తెలివిగా రూపొందించిన SMS పంపారని అదితి చోప్రా తెలిపారు. ఈ వెల్ ప్లాన్డ్ ఫ్రాడ్‌కి తాను దాదాపుగా బలయ్యానని చెప్పింది. ఈ పోస్ట్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పందించింది. మోసం జరుగుతున్నట్లు అనుమానం వస్తే ప్రజలు వెంటనే చక్షు- (Chakshu- ఫ్రాడ్ కాల్స్, టెక్స్ట్‌లను రిపోర్టు చేసే ప్లాట్‌ఫామ్)లో కంప్లైంట్ చేయాలని సూచించింది.
* ఫ్రాడ్ కాల్స్‌తో జాగ్రత్త
2024 మార్చిలో కూడా టెలికాం డిపార్ట్మెంట్ ప్రజలకు ఓ సూచన చేసింది. DoT పేరిట మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేయమని బెదిరిస్తూ వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రజలకు మోసగాళ్లు ఫోన్ చేసి, DoT నుంచి మాట్లాడుతున్నట్లు చెబుతున్నారని, మొబైల్ నంబర్స్ అన్నింటినీ డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. అనంతరం ఆ నంబర్లను కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ఫారిన్ ఆరిజన్ మొబైల్ నంబర్ల (+92 వంటివి) నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, ప్రభుత్వ అధికారుల తరహాలో నటించి మోసం చేసే కేటుగాళ్ల విషయంలో కూడా సూచనలు చేసింది.
* చక్షు పోర్టల్ అంటే ఏంటి?
ఆన్లైన్ మోసాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చక్షు పోర్టల్‌ను మార్చిలో ప్రారంభించింది. అంతకుముందు, ఫేక్ కాల్స్ నిరోధించడానికి కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్‌ను ప్రవేశపెట్టాలని TRAI టెలికాం కంపెనీలను కోరింది. తర్వాత, టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన కేంద్ర ప్రభుత్వం సంచార్ సతి ఇనిషియేటివ్‌లో భాగంగా, మోసపూరిత కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయడానికి వినియోగదారుల కోసం ప్రత్యేక చక్షు పోర్టల్ రూపొందించింది.
* స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు..
ఇందులో భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫ్రాడ్ కమ్యూనికేషన్‌పై కంప్లైంట్ చేయవచ్చు. ఫేక్ కాల్స్, ఎస్సెమ్మెస్, ఇ-మెయిల్ ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఫిర్యాదులు చేయవచ్చు. అంతే కాకుండా బ్యాంక్ అకౌంట్లు, పేమెంట్ వ్యాలెట్లు, సిమ్ కార్డ్‌లకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు.