ర్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నుంచి కోలుకోక ముందే కేంద్రంలో అధికార బీజేపీకి పలు షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే తాజాగా 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉపఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెల్చుకున్న ఎన్డీయేకు తాజాగా పార్లమెంటులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజ్యసభలో ఆ పార్టీ బలం 86కు పడిపోయింది. ప్రస్తుత ఎంపీల్లో నలుగురు రిటైర్ కావడంతో ఎన్డీయే బలం తగ్గింది.
రాజ్యసభకు గతంలో ఎన్డీయే సర్కార్ నామినేట్ చేసిన రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీకాలం పూర్తవడంతో రిటైర్ అయ్యారు. దీంతో రాజ్యసభలో బిజెపి బలంలో నాలుగు తగ్గిపోయింది. ఈ నలుగురినీ అధికార పార్టీ సలహా మేరకు అధ్యక్షుడు ద్రౌపది ముర్ము నాన్-అలైన్డ్ సభ్యులుగా గతంలో నామినేట్ చేశారు. ఆ తర్వాత అధికారికంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వీరు అండగా నిలిచారు.
ఇప్పుడు వారి పదవీ విరమణతో రాజ్యసభలో బీజేపీ 86కి పడిపోయింది. అలాగే బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బలం 101కి పడిపోయింది. ఇది 245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుత మెజారిటీ మార్క్ 113 కంటే తక్కువ.ప్రస్తుతం రాజ్యసభ బలం 225 కాగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 సభ్యులున్నారు. అందులో కాంగ్రెస్‌కు 26, బెంగాల్‌లోని అధికార తృణమూల్‌కు 13, ఢిల్లీ, తమిళనాడులో అధికారంలో ఉన్న ఆప్, డిఎంకెకు తలో 10 మంది ఎంపీలున్నారు. ఇరు కూటముల్లో లేని వైసీపీ, బీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీల ఎంపీలు మిగిలిన వారిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లులు నెగ్గించుకోవాలంటే బీజేపీకి 12 మంది ఇతర ఎంపీల బలం అవసరం. అయితే ఏపీలో అధికారం కోల్పోయినా బీజేపీకి అండగా ఉంటున్న వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండటం, ఒకరిద్దరు స్వతంత్ర ఎంపీల మద్దతు కూడా లభించే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఒడిశాలో అధికారం కోల్పోయిన బీజేడీ గతంలోలా బీజేపీకి మద్దతివ్వబోమని తేల్చిచెప్పేసింది.