- తర్వాతి అరెస్టు ఎంపీ రాఘవ్ చద్దాదే..
- ధిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
న్యూధిల్లీ,సెప్టెంబర్30 (ఆంధ్రపత్రిక): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ మధ్య పోరు గట్టిగానే నడుస్తోంది. గుజరాత్లో ఆప్‌కు వస్తోన్న ఆదరణ చూసి భాజపా భయపడుతోందని, అందుకే తమ పార్టీ నేతలను అరెస్టు చేయిస్తోందని ధిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలుమార్లు కాషాయ పార్టీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ అరెస్టులపై స్పందిస్తూ కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. తర్వాతి టార్గెట్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దానే అని.. ఆయనను అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ‘’గుజరాత్ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన రాఘవ్ చద్దా.. ఇటీవల అక్కడ ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆయనను అరెస్టు చేసేందుకు వారు(భాజపాను ఉద్దేశిస్తూ) సన్నాహాలు చేస్తున్నట్లు మాకు తెలిసింది. ఒకవేళ అరెస్టు చేస్తే.. ఏ అభియోగాలు మోపాలన్నదానిపై ప్రస్తుతం వారు ప్రణాళికలు రచిస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ట్విటర్లో రాసుకొచ్చారు. అయితే ఏ దర్యాప్తు సంస్థ ఈ అరెస్టుకు పాల్పడే అవకాశముందన్న విషయాన్ని మాత్రం సీఎం వెల్లడిరచలేదు. ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంలో రాఘవ్ చద్దా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను ఆప్ రాజ్యసభకు పంపించింది. ఇటీవలే చద్దాను గుజరాత్ రాజకీయ వ్యవహారాల కో-ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దిల్లీలో కలకలం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం వ్యవహారంలో పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత మంగళవారం దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అత్యంత సన్నిహితుడు, పార్టీ మీడియా కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కుంభకోణం వ్యవహారంలో సిసోదియా నివాసంలోనూ సీబీఐ తనిఖీలు చేసింది. అయితే ఈ అరెస్టులు, సోదాల వ్యవహారంలో భాజపాపై కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్లో ఆప్ చేతిలో తాము ఓడిపోతామన్న భయంతోనే కాషాయ పార్టీ ఇలా కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు.