కృష్ణాజిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందిస్తున్న బిజెపి బందరు నియోజకవర్గ ఇన్చార్జి సోడిశెట్టి బాలాజీ రావు, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ తదితరులు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం ధర్నాలు చేయమంటారా? రాస్తారోకోలు చేయమంటారా.?
కృష్ణా జిల్లా కలెక్టర్ కు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య అభిమానులు అల్టిమేటమ్..!
టేబుల్ ఎజెండా పెడుతున్నానని జిల్లా కలెక్టర్ కు చెప్పిన మచిలీపట్నం నగర కార్పోరేషన్ కమిషనర్…!
జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేయని కింది అధికారులు…!
కృష్ణాజిల్లా కలెక్టర్ తో స్వర్గీయభోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం అభిమానులు సుదీర్ఘ చర్చలు..!
మచిలీపట్నం ఆగస్టు 7 (ఆంధ్ర పత్రిక) ; వక్కలంక వెంకట రామకృష్ణ , స్టాఫ్ రిపోర్టర్..! ప్రముఖ న్యాయవాది, బిజెపి మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్, సోడిశెట్టి బాలాజీ ఆధ్వర్యంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు, అభిమానులు సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ ను స్పందన కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిసి గత సంవత్సరన్నర కాలము నుండి మచిలీపట్నంలో భోగరాజు స్మారక భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థలం కేటాయించినట్టు ఆ స్థలమునకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా మచిలీపట్నం నగర కార్పోరేషన్ అనుమతులు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని వినతి పత్రం అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి, సోడిశెట్టి బాలాజీ జిల్లా కలెక్టర్ కు అందజేసిన వినతి పత్రాన్ని చూపి మీడియాతో మాట్లాడుతూ
సాక్షాత్తు జిల్లా కలెక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్లో గల రెవెన్యూ కళ్యాణ మండపం ప్రక్కన రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తూ 2023 ఏప్రిల్ 25 వ తేదీన ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని అన్నారు.
ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత మచిలీపట్నం నగర కార్పోరేషన్ అధికారులపై ఉందని, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ ను పలుమార్లు కమిటీ సభ్యులు కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం శూన్యం అని నగర పాలక సంస్థ కాలయాపన చేయడాన్ని చూస్తే నగరపాలక సంస్థ కమిషనర్ నిర్లక్ష్యం ఎంత మేర ఉందో అర్థం చేసుకోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ నాయకుని పేరు మీద స్మారక భవనం ఏర్పాటు చేస్తామంటూ యూనియన్ బ్యాంక్ నలభై కోట్ల రూపాయలతో ముందుకు వస్తే జరగబోయే అభివృద్ధిని అడ్డుకుంటున్న అధికారులు, పాలకులు ప్రజలకు , సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది? అని అన్నారు. అభివృద్ధి అడ్డుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులను, పాలకులను హెచ్చరించారు.
కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయని నగర కార్పోరేషన్ పాలకవర్గాన్ని 679(D) ప్రకారం రద్దు చేయవచ్చని కూడా కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా వివరించామని అన్నారు
కృష్ణా జిల్లా కలెక్టర్ కు కూడా పలుమార్లు వినతి పత్రాలు సమర్పించామని సరైన సమాధానం ఇవ్వడం లేదని, ఈసారి కృష్ణా జిల్లా కలెక్టర్ స్వయంగా విషయం తెలుసుకొని మాట్లాడతానని హామీ ఇచ్చారని తెలిపారు.
మేమిచ్చిన రిప్రజెంటేషన్ పై ఈసారి జిల్లా కలెక్టర్ కూడా సరిగా స్పందించకపోతే న్యాయపోరాటం చేయడానికి సిద్దం అని బాలాజీ రావు అన్నారు.
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, గోపు సత్యనారాయణ మాట్లాడుతూ
జాతీయ నాయకుని పేరు మీద ఏర్పాటు చేసే స్మారక భవన నిర్మాణానికి అడ్డుతగులుతున్న పాలకులకు వచ్చే ఎన్నికల్లో పుట్ట గతులు కూడా ఉండవని హెచ్చరించారు. పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్వాతంత్ర్య సమరయోధుడిని అవమానిస్తున్న పాలకులకు, అధికారులకు బుద్ధి వచ్చేలా జిల్లా పరిషత్ సెంటర్ లోని భోగరాజు కాంస్య విగ్రహం వద్ద అందరినీ కలుపుకుంటూ నిరసన దీక్ష చేపడతామని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయని క్రింది స్థాయి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా స్వాతంత్ర సమరయోధుడి స్మారక భవనం ఏర్పాటు చేయకుండా పాలకులు అడ్డుతగులుతూ , ప్రక్కనే వైసీపీ కార్యాలయాన్ని ఆగమేఘాల మీద పనులు చేయించడం ప్రజలందరూ గమనిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పాలకులు గ్రహించ పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భోగరాజు అభిమానులు, వేమూరి రామకృష్ణారావు, ఏ ఆర్ కె మూర్తి, పంతం వెంకట గజేంద్ర రావు, పి.వి. ఫణి కుమార్, అక్కు మహంతి రాజా, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నాగలింగం అయోధ్య రామచంద్రరావు, వైవిఆర్ పాండురంగారావు, పెదసింగు శ్రీనివాసరావు, ఓరుగంటి చలం, వి ఎస్ ఎస్ ఆర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.