ఏపీలో చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ప్రమాణ స్వీకారినికి ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగ ప్రక్షాళన ప్రారంభించారు.
ఏపీకి నూతన సీఎస్..డీజీపీ నియామకం పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.
చంద్రబాబు నిర్ణయాలు
ఏపీలో కీలక నియామకాలు మొదలయ్యాయి. పాలనలో ముఖ్య కేంద్రమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీలో రెవిన్యూతో సహా పలు కీలక శాఖల్లో అయన పని చేసారు. గతంలో భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ గా పని వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ..అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. గతంలోనూ తాత్కాలిక ప్రభుత్వప్రదాన కార్యదర్శిగా పని చేసారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబుతో నీరభ్ కుమార్ సమావేశమయ్యారు.
ఏపీకి నూతన సీఎస్
నీరబ్ లేదా విజయానంద్ పేర్లు సీఎస్ గా నియామకం కోసం పరిశీలించారు. కాగా, చంద్రబాబు సీఎస్ గా రెవిన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నీరభ్ వైపు మొగ్గు చూపారు. ఇక, ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. ఆయన్ను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబును కలిసేందుకు జవహర్ రెడ్డి వచ్చిన సమయంలోనూ ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్నికల సమయంలో జగన్, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని జవహర్ రెడ్డి పైన అభియోగాలు ఉన్నాయి.
చంద్రబాబు కసరత్తు
అయితే, నీరబ్ ఈ నెల30న పదవీ విరమణ చేయనున్నారు. చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తరువాత నీరభ్ సేవలు మరి కొంత పొడిగించాలని భావిస్తే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సీనియార్టీ ప్రాతిపదికన చంద్రబాబు నీరభ్ కుమార్ వైపు మొగ్గు చూపారు. ఇక..సీఎంఓ లో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర పేరు ఖాయమైంది. సీఎంఓలో అధికారులుగా సాయిప్రసాద్, గిరిజా శంకర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇక, డీజీపీ విషయంలో ఇద్దరి పేర్ల పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరి పేరును ఈ రోజు ఖాయం చేసే అవకాశం కనిపిస్తోంది.