Market Crash | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది.
నిఫ్టీ 24,300 దిగువన ఖాతా తెరిచింది. దీంతో ట్రేడింగ్ మొదట్లోనే మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.
ఉదయం 11:19 గంటల సమయంలో సెన్సెక్స్ 2,383 పాయింట్లు నష్టపోయి 78,598 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 724 పాయింట్లు కుంగి 23,993 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్ (5.71%), టాటా స్టీల్ (4.99%), మారుతీ (4.87%), ఇన్ఫోసిస్ (4.69%), టెక్ మహీంద్రా (4.67%), ఎస్బీఐ (4.43%), అదానీ పోర్ట్స్ (4.42%), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (3.92%), ఎం అండ్ ఎం (3.72%), పవర్‌గ్రిడ్ (3.72%), హెచ్‌సీఎల్ టెక్ (3.57%), ఎల్ అండ్ టీ (3.57%) షేర్లు భారీగా నష్టపోతున్నాయి.
సూచీలను బేర్ తన గుప్పిట్లో బంధించి మదుపరులను నష్టాల్లో ముంచడానికి గల కారణాలేంటో చూద్దాం..
అమెరికాలో మాంద్యం భయాలు..
అమెరికాలో జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది. దీంతో మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో జులై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందు అంచనా వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ సంఖ్య చాలా దిగువన ఉండటంతో మాంద్యం రావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకుంది.
జపాన్‌లో అమ్మకాలు..
బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీరేట్లను 0.25 శాతం పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. దీంతో నష్టాలను నివారించడం కోసం మదుపర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపిస్తోంది. జపాన్ నికాయ్ సూచీ సోమవారం ఓ దశలో ఏడు శాతానికి పైగా కుంగింది.
భౌగోళిక ఉద్రిక్తతలు..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందోనని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. సోమవారమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ జీ7 దేశాలకు సమాచారమిచ్చారు. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతులకు గురవుతున్నాయి.
అధిక విలువలకు స్టాక్స్..
గతవారం భారత మార్కెట్ సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి. బఫెట్ ఇండికేటర్‌గా పిలిచే మార్కెట్ క్యాప్, జీడీపీ నిష్పత్తి రికార్డు గరిష్ఠమైన 150 శాతానికి చేరింది. దీంతో అనేక కంపెనీల స్టాక్స్ అధిక విలువల వద్ద ట్రేడవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు మార్కెట్లో దిద్దుబాటు తప్పకపోవచ్చునని వివరించారు.
ఉత్సాహపర్చని త్రైమాసిక ఫతిలాలు..
ఇప్పటి వరకు వెలువడ్డ వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలన్నీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ, ఎక్కడా మార్కెట్లను ఉత్సాహపరిచేంతటి పాజిటివ్ న్యూస్ లేకపోవడం గమనార్హం.