టిడిపితోనే బిసిలకు రాజకీయ అధికారం
వారి అభ్యున్నతికి పాటుపడ్డ పార్టీ కేవలం టిడిపి మాత్రమే
13 రోజు దిగువమాసపల్లి నుంచి యాత్రప్రారంభించిన లోకేశ్
గ్రామస్థులతో ముఖాముఖిలో వారికి భరోసా
చిత్తూరు,ఫిబ్రవరి 8 (ఆంధ్రపత్రిక): తెలుగుదేశం రాకతోనే బిసిలకు రాజకీయ అధికారం దక్కిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. రాజకీయ స్వాతంత్యర్ర వచ్చింది 1983లోనే అని అన్నారు. బలహీన వర్గాల్లో పేదరికం ఉండకూడదనేది చంద్రబాబు లక్ష్యమని అన్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాద యాత్ర బుధవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. బుధవారం దిగువమాసపల్లి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా అయ్యనవేడు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ బీసీలకు కుల వృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఐదేళ్లలో రూ. 29 వేల కోట్లు సబ్ ప్లాన్ ద్వారా బీసీలకు ఖర్చు చేశామన్నారు. బలహీన వర్గాల విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న లక్ష్యంతో విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. జగన్ సొంత బిడ్డలు విదేశాల్లో చదవొచ్చా.. బలహీన వర్గాల వారి పిల్లలు చదవకూడదా. అని లోకేష్ ప్రశ్నించారు. సీమ జిల్లాల నుంచి వలసలు ఎక్కువయ్యాయని, డ్రిప్, ఇతర వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదని విమర్శించారు. బీసీలపై ఈ ముఖ్యమంత్రికి ప్రేముంటే రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారని నిలదీశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుల్లో 71 శాతం మంది సొంత సామాజిక వర్గం వారేనని ఆరోపించారు. వాల్మీకీ, రజకులను ఎస్టీల్లో చేరుస్తాని హావిూ ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారని అన్నారు. కేంద్రం ఈ మధ్య 28 కులాలను ఎస్టీల్లో చేర్చిందని.. మరి జగన్ ప్రభుత్వం ఎందుకు కృషి చేయడం లేదని లోకేష్ ప్రశ్నించారు. జగన్ ఇంట్లో.. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే ఉంటారు.. కానీ బీసీలు మాత్రం జగన్ రెడ్డి ఇంటి బయట ఉంటారన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఆ నలుగురు రెడ్ల పక్కన కూర్చోనివ్వరని అన్నారు. ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. పదవులిస్తే సరిపోదని, గౌరవం ఇవ్వాలన్నారు. కొందరు బీసీ`ఏ నుంచి ఓబీసీకి చేర్చాలని అడుగుతున్నారని.. ఆ అంశంపై ఆలోచిస్తామని నారా లోకేష్ అన్నారు. కాగా అంతకుముందు దిగువమాసపల్లి క్యాంప్ సైట్ వద్ద పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతి రోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.