Balineni Srinivasa Reddy: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
ఆ పార్టీలో కీలక నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు అప్పుడే మొదలయ్యాయి.మొన్నటి ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి దక్కింది.. 11 స్థానాలే. కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. విశాఖపట్నం- 2, చిత్తూరు-2, కర్నూలు- 2, ప్రకాశం- 2, కడప- 3.. ఇవీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య.
లోక్‌సభలోనూ పరాభవమే ఎదురైంది. నాలుగు స్థానాలకే పరిమితమైంది. అరకు, కడప, తిరుపతి, రాజంపేటల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2019లో తెలుగుదేశం పార్టీ చవి చూసిన దానికంటే ఘోర ఓటమి ఇది. నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి.దీని తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఈక్వేషన్లు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన కొందరు బలమైన నాయకుల వైపు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కన్నేసినట్టే కనిపిస్తోంది. అసంతృప్తులకు కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తెర మీదికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరొచ్చనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయన మంతనాలు ప్రారంభించారనీ అంటున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ బాలినేని చేసిన ట్వీట్ తరువాత ఈ ప్రచారం మరింత ముమ్మరం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బాలినేని. హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వ్యాఖ్యలకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొందని బాలినేని చెప్పారు. ఒంగోలు చరిత్రలో ఎన్నడూలేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మాక ఘటనలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు, అనుచరులపై వేధింపుల గురించి స్పందించాలని కోరుకుంటున్నానని అన్నారు. శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదని వివరించారు.ఈ ఎన్నికల్లో బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన దామచర్ల జనార్ధన్ రావు చేతిలో 34 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.