భద్రాచలం మన్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ( సీపీఐ ) భారీ స్కెచ్ వేసింది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీపీఐ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. భద్రాచలం అసెంబ్లీ సీటుపై కన్నేసిన సీపీఐ ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధమవుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో సీనియర్లకు పెద్ద పీట వేస్తూ ముందడుగు వేస్తోంది. మండల కమిటీల పటిష్టతపై దృష్టి సారించింది. పార్టీకి దూరమైన గత శ్రేణులను దగ్గరికి తీసుకుంటోంది. భద్రాచలం నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాలకు పైగా ఒంటి చేత్తో రాజకీయాలు శాసిస్తున్న సీపీఐ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ ఈసారి మన్నెంలో సీపీఐ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహ రచనను అమలు చేస్తున్నారు.
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సీటుపై సీపీఐ కన్ను వేసింది. గత నాలుగు దశాబ్దాలుగా పలు పార్టీలతో ఎన్నికల రాజకీయ పొత్తులతో సీటును త్యాగం చేస్తూ వచ్చిన సీపీఐ ఈసారి ఎలాగైనా పోటీ చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతోంది. పొత్తులు కుదరకపోయినా ఒంటరిగానే బరిలోకి దిగుతామని శపథం చేస్తోంది. భద్రాచలం అసెంబ్లీ సీటు ఈసారి తమ పార్టీకే దక్కనుందన్న ఆశాభావాన్ని సీపీఐ వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్తో పొత్తు ఉంటే.. భద్రాచలం అసెంబ్లీ సీటు సీపీఐకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. సీపీఐ పార్టీ తరఫున ఓ మహిళను ఈసారి బరిలోకి దింపనున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం అసెంబ్లీ సీట్లు పొత్తుల్లో భాగంగా సీపీఐకే దక్కనున్నాయనే ప్రచారం ఊపందుకుంది.భద్రాచలం అసెంబ్లీ సీటుపై కన్నేసిన సీపీఐ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. స్థానిక సమస్యలపై స్పందిస్తూ అడపాదడపా సీపీఐ ప్రజా పోరాటాలు నిర్వహిస్తోంది. పోడు భూముల పట్టాల విషయంలో పార్టీ నేతలు ప్రధాన దృష్టి సారిస్తూ వస్తున్నారు. సీపీఐ పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అనేక కార్యక్రమాలు భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొనేలా స్థానిక నేతలు దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా భద్రాచలం నియోజకవర్గంలో గిరిజన, గిరిజనేతర ప్రజలకు దగ్గరగా ఉంటూ పార్టీ కేడర్ పెంచుకునే పనిలో ఆ పార్టీ సీనియర్ నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో సీపీఐ బాగా బలపడిరది అనే చెప్పవచ్చు. సీపీఐ రాష్ట్ర, జిల్లా నేతలు తరచూ భద్రాచలం నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. యువకులను కూడా చేరదీస్తున్నారు. గతంలో పార్టీలో ఉండి స్తబ్దుగా ఉన్న సీనియర్ నేతలను కూడా పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో సీపీఐలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు పనిచేసిన న్యాయవాది పడిసిరి శ్రీనివాసరావు ఇటీవల సీపీఐలో చేరారు. ఇటువంటి సీనియర్లను మళ్ళీ పార్టీ వైపు మళ్లించే ప్రయత్నాల్లో సీపీఐ నేతలు కసరత్తు ప్రారంభించారు.పార్టీలో ఉన్న సీనియర్లు, సమర్థులకు మండల బాధ్యతలు అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీని విస్తృత పరచాలన్న భారీ స్కెచ్ సీపీఐ వేసింది. ఇందులో భాగంగానే భద్రాచలం సీపీఐ మండల కార్యదర్శి పదవి రెండవ సారి ఆకోజు సునీల్ కుమార్కు అప్పగించింది. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన సునీల్ కుమార్ పై పార్టీ సీనియర్ నేతలు నమ్మకం ఉంచి అత్యంత కీలకమైన భద్రాచలం మండల కార్యదర్శి పదవిని అప్పగించింది. సీపీఐకి గుండెకాయ అయిన దుమ్ముగూడెం మండలంలో పార్టీని మరింత విస్తృత పరచాలనే లక్ష్యంతో సీపీఐ సీనియర్ నేత రావుల పల్లి రవి కుమార్కు మరోసారి మండల కార్యదర్శి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలోనే పలు పర్యాయాలు పార్టీ మండల కార్యదర్శిగా పనిచేసిన రావులపల్లికి మళ్లీ మండల బాధ్యతలు అప్పగించడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు సమాచారం. అతిపెద్ద మండలంగా ఉన్న దుమ్మగూడెంలో వచ్చే ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందాలనే ముందస్తు వ్యూహం తోనే మళ్ళీ రావులపల్లిని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. ఇక్కడ సీపీఐ బాధ్యతలు నిర్వహిస్తున్న.. గతంలో భద్రాచలం ఎంపీగా పోటీ చేసి ఓడిన కుంజా శ్రీనుకు మరో మండల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. చర్ల మండలంలో కూడా పార్టీకి చెందిన సీనియర్ నేతకే అక్కడి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వెంకటాపురం, వాజేడు మండలాలలో సైతం పార్టీని విస్తృత పరిచేందుకు చర్ల, దుమ్ముగూడెంకు చెందిన సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయా మండల కమిటీలను పటిష్టం చేసి డివిజన్ కమిటీలు తరచూ మానిటరింగ్ చేస్తూ పార్టీని విస్తృత పరచాలని సిపిఐ డివిజన్ నాయకత్వం దృష్టి సారిస్తోందని సమాచారంభద్రాచలం నియోజకవర్గంలో సీపీఐకి వెన్నెముకగా ఆ పార్టీ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్(ఆర్పీ) నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీని కన్నతల్లి వలే సాకుకుంటూ వస్తున్నారు. గతంలో అంతంతమాత్రంగానే ఆదరణ ఉన్న సీపీఐకి నియోజకవర్గంలో మంచి గుర్తింపు వచ్చేలా ఆర్పీ పావులు కదుపుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఒంటిచేత్తో రాజకీయాలు శాసిస్తూ ముందుకు సాగుతున్నారు. తాను ముందుండి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు.ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమాలు నిర్వహిస్తూ పార్టీలో ‘‘పెద్దన్న’’ పాత్ర పోషిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని పార్టీని విస్తృత పరచడంలో ఆర్పీ అగ్ర భాగాన నిలుస్తున్నారు. స్థానిక, సాధారణ ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీని బలోపేతంగా మారుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో నిత్యం టచ్లో ఉంటూ పార్టీకి మంచి జోష్ తీసుకొచ్చారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలంలో సీపీఐ పాగా వేసేందుకు రావులపల్లి మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలు తమ్మల్ల వెంకటేశ్వరరావు(టీవీ ), రావులపల్లి రవికుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, కుంజా శ్రీను, తోట మల్లికార్జున్, తాతాజీ, ఆకోజు సునీల్ కుమార్, బళ్ల సాయి కుమార్ తదితరులుపార్టీ పురోగతిలో శక్తివంచన మేర కృషి చేస్తూ వస్తున్నారు. జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కూడా భద్రాచలం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!