తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆదినారాయణ విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆదినారాయణ సమీప బీఆర్ఎస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావుపై 23,358 ఓట్ల మెజార్టీతో ఆదినారాయణ విజయం సాధించారు. కాగా, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు.. అనంతరం బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ, బీజేపీతో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి ఉమాదేవి బరిలో నిలిచారు. సీపీఎం నుంచి అర్జున్ రావు పోటీ చేశారు. ఇక 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మెచ్చా నాగేశ్వరరావు 13,117 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మెచ్చా నాగేశ్వరరావుకు 61,124 ఓట్లు దక్కగా.. బీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు 48,007 ఓట్లు పోల్ అయ్యాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరారు. 2014లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధి తాతి వెంకటేశ్వర్లు గెలుపొందగా.. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మిత్రసేన వగ్గేలా విజయం సాధించారు.