మచిలీపట్నం నవంబర్ 21 ఆంధ్రపత్రిక.:
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే లంచాలు తీసుకోవడం తప్పుకాదనేలా, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు.
అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు ఎక్కువ అయ్యాయని,ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడం వల్లే , లంచాలు తీసుకోవాల్సి వస్తోందంటూ బొప్పరాజు చేసిన వాఖ్యల వల్ల రెవెన్యూ శాఖకు మరింత చెడ్డపేరు వచ్చేలా ఉంది అని తెలిపారు. బొప్పరాజు వ్యాఖ్యలు ఉద్యోగులను లంచాలు తీసుకోమని ప్రేరేపించేలా ,అవినీతిని సమర్ధించేలా ఉన్నాయని ఆన్నారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయితే అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని,రాష్ట్ర నాయకులుగా నిజాయితీగా ప్రశ్నించి హక్కులు సాధించుకోవాలి, అంతే తప్ప జీతాలు ఆలస్యం వల్ల లంచాలు తీసుకోవడంలో తప్పు లేదు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు రావలసిన న్యాయమైన డిమాండ్ల కొరకు పోరాడాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కి సూచించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం ఒక సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు చేసినంత మేలు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. గతంలో పీఆర్సీ అంశంలో ఐక్యంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని బలహీనపరిచి ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని బొప్పరాజు తదితరులు కలిగించారన్నారు. 2018 జూలై నుండి ఇవ్వవలసిన డి. ఏ బకాయిలు, పిఆర్సి బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, ఏపీ జి ఎల్ ఐ, తదితరాలు ఇంత వరకు సెటిల్ అవ్వలేదని ఇప్పటికైనా సదరు సమస్యలు పరిష్కరించడం లో, చిత్త శుద్ది తో వ్యవహరించాలని అన్నారు. అపుడు ఐక్యం గా ఉన్న సంఘ నాయకులు, ఇపుడు ఎవరికి వారు వేరు వేరు కుంపట్లు ఎందుకు పెట్టారో? చెప్పాలని బొప్పారాజు ను డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఒక సారి ఆహా,ఓహో అనటం మరో సారి విమర్శించటం లాంటి అవకాశవాద విధానాలు శోచనీయం అన్నారు.ఇప్పటికైనా ఉద్యోగ సంఘ నాయకులు ఈ విధంగా ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, చేయటం మానుకోవాలని అన్నారు. దీనివల్ల ఉద్యోగులకు నష్టం తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఉంటే నష్టపోయేది సామాన్య ప్రజలేనని అన్నారు. అవినీతిపై ఏసిబి చేస్తున్న దాడులను తమ అసోసియేషన్ పక్షాన స్వాగతిస్తున్నట్లు సురేష్ బాబు తెలిపారు. అవినీతిపరులు ఎక్కడ ఉన్నా ఏరి పారెయ్యలన్నారు.