PAK vs SL: శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వడంపై మండిపడుతోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన సిరీస్‌కు నో చెప్పింది.
ఆసియా కప్ 2023 నిర్వహణకు సంబంధించి చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఆతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్థాన్‌పై సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుతం ఆసియా కప్ పరిస్థితిపై స్పష్టత లేదు. ఇంతలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసియాకప్‌ను నిర్వహించేందుకు ఆసక్తిని కనబరిచింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరించినట్లు సమాచారం. PTI వార్తల ప్రకారం, ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలను ఆసియా కప్ దెబ్బతీస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ టోర్నమెంట్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేయడంతో.. ఈ వివాదం మొదలైంది. దీంతో వచ్చే నెలలో శ్రీలంకలో వన్డే సిరీస్ ఆడేందుకు పీసీబీ నిరాకరించింది.
ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తదుపరి సైకిల్లో భాగంగా ఈ ఏడాది జులైలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. దీనితో పాటు, శ్రీలంక కూడా పీసీబీ ముందు వన్డే సిరీస్ ఆడాలని ప్రతిపాదించింది.
నివేదికల ప్రకారం, ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని పీసీబీ మొదట చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు దానిని తిరస్కరించింది. సెప్టెంబరులో ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వాలని శ్రీలంక క్రికెట్ ఆఫర్ చేయడంతో పీసీబీ సంతోషంగా లేదనడానికి ఇది స్పష్టమైన సూచనగా తెలుస్తోంది.
విశేషమేమిటంటే, ఈ సంవత్సరం చాలా పెద్ద టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి చివరి మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత ప్రపంచకప్, ఆసియాకప్ కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ ఆసియా కప్, ప్రపంచ కప్ తేదీలను ఇంకా ప్రకటించలేదు. దీంతో పాటు ఈ రెండు టోర్నీల వేదిక ఎక్కడుందో కూడా తేల్చలేదు.