కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? గులాబీ పార్టీ మీద ఎర్రన్నల ప్రేమ వన్ సైడేనా? మునుగోడు విజయంతో ఎర్ర పార్టీలను పొగిడిన గులాబీ దళపతి…
ఇప్పుడు పట్టించుకోవడంలేదా? మిత్రపక్షాలుగా మారిన ఎర్ర గులాబీలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయి ఎందుకు? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది?
తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ గులాబీ పార్టీ విషయంలో చెరో దారిలో ప్రయాణించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు బేషరతు మద్దతు ప్రకటించాయి. ప్రచారంలో కలిసి ముందుకు సాగాయి. మునుగోడులో గులాబీ పార్టీ విజయంలో లెఫ్ట్ పార్టీల సహకారం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దీంతో సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందనే ప్రచారం జరిగింది. ఉనికి కోసం ఆరాటపడుతున్న ఉభయ కమ్యూనిస్టులకు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కలిసొచ్చింది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని.. అసెంబ్లీలో ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గాల్లో ఖర్చీఫ్‌లు కూడా వేసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్తో కుదిరిన స్నేహం కారణంగా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పై లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రేమ చూపిస్తున్నా… పైకి ప్రేమగా మాట్లాడుతున్నా లోపల కత్తులు దూస్తున్నారట జిల్లాల్లోని గులాబీ పార్టీ నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాల్లో స్థానిక నేతలు కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదనే చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేస్తానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించగా.. సిటింగ్ ఎమ్మెల్యేను తానుండగా ఇంకెవరు పోటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపెందర్ రెడ్డి రచ్చకు దిగారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం కొంత వెనక్కి తగ్గి సీపీఎం పోటీ చేస్తే బీఆర్ఎస్ సహాకరిస్తుంది.. బీఆర్ఎస్ పోటీ చేస్తే సీపీఎం సహకరిస్తుందని ప్రకటించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు మధ్య అసలు పొసగడం లేదట. అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహాకరిస్తున్న తమను పట్టించుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారని జూలకంటి రంగారెడ్డి వాపోతున్నారట. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కూడా తన సొంత నియోజకవర్గం కొత్తగూడెంలో పలు సార్లు పరాభవం ఎదురైందట. కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కూనంనేని. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో తమ పార్టీ నేతల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట కూనంనేని.
రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్రనాయకుల మధ్య అవగాహన ఉన్నా.. స్థానిక నాయకత్వం మధ్య స్నేహం లేకపోవడంతో సీపీఐ, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్కు అవగాహన కుదరడం లేదట. తాము వన్ సైడ్ లవ్‌తో ప్రభుత్వానికి సహకరిస్తున్నా స్పందించకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారట కమ్యూనిస్టు పార్టీల నేతలు. చూడాలి మరి ఎర్ర పార్టీలకు, గులాబీ పార్టీతో పొత్తు కుదురుతుందా లేక గతంలో మాదిరిగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే తమ సీటు పోతుందనుకుంటున్న గులాబీ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు మాత్రం లెఫ్ట్ నాయకులంటే కస్సుమంటున్నారనే టాక్ నడుస్తోంది.