వి.కార్తికేయ పాండ్యన్ ఆదివారం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిజద ఓటమి చెందిన తరువాత పరాజయాలపై రెండు రోజులుగా ఆ పార్టీ అధినేత నవీన్ నేతలతో సమీక్షిస్తున్నారు.
సమావేశంలో నేతల అభిప్రాయలు విన్న నవీన్ పట్నాయక్ సూచన మేరకు పాండ్యన్ ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
భువనేశ్వర్, న్యూస్‌టుడే
నష్ట నివారణ చర్యలు
శంఖ భవన్లో శనివారం సీనియర్, యువ నేతలతో నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. బిజద ఘోర వైఫల్యానికి పాండ్యన్ బాధ్యుడని యువనేతలంతా తెలిపారు. పాండ్యన్ ఉత్తముడని, ఆయనను విమర్శించడం తగదని నవీన్ చెప్పినప్పటికీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో పాండ్యన్ కొనసాగితే చీలిక తప్పదనే సంకేతాలు అధినేతకు ఇవ్వడంతోపాటు ప్రజాదరణలో ముందున్న బిజదను ఓటమి అంచులకు తీసుకెళ్లిన తమిళ వ్యక్తికి కొమ్ముకాస్తే తామంతా ప్రతిష్ఠ కోల్పోతామని తెలిపారు. ఆలోచనలో పడిన నవీన్ పట్నాయక్.. పాండ్యన్‌కు సూచించడంతో ఆయన రాజకీయలకు గుడ్‌బై చెప్పినట్లు తెలిసింది.
ఎవరికి బాధ్యతలు
గతేడాది అక్టోబరు 23న ఐఏఎస్ అధికారిగా వీఆర్ఎస్ తీసుకున్న పాండ్యన్ నవంబరు 27న బిజదలో చేరారు. 2024 బిజద ఎన్నికల సారథి అయ్యారు. హెలికాప్టరులో 147 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించారు. పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆయన తీసుకున్న నిర్ణయాలు బిజద పరాజయానికి దారి తీశాయి. అంతా జరిగాక ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడితే ప్రయోజనం ఏముంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వయోభారం మూలంగా నవీన్‌లో మునుపటి ఉత్సాహం లేదు. ఈ పరిస్థితిలో నవీన్‌ను సరితూగే నేత ఎవరు అన్నది తెలియడం లేదు. మాజీ ముఖ్యమంత్రి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న అంశం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
అదే బాటలో అచ్యుత సామంత
భువనేశ్వర్, న్యూస్‌టుడే: కొంధమాల్ మాజీ ఎంపీ, బిజద సీనియర్ నేత అచ్యుత సామంత రాజకీయలకు దూరమవుతున్నట్లు ఆదివారం భువనేశ్వర్‌లో ప్రకటించారు. మాజీ సీఎం నవీన్ విధేయునిగా ముద్రపడిన అచ్యుత ఈసారి జరిగిన ఎన్నికల్లో కొంధమాల్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. కిస్ విద్యాసంస్థల వ్యవస్థాపకునిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.