Reutersప్రధాని మోదీతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
దాదాపు పదేళ్ల క్రితం నరేంద్ర మోదీ తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అనేక పొరుగు దేశాల అధినేతలను భారత్లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కూ ఆహ్వానం అందింది.
భారత విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని మోదీ ప్రభుత్వం మొదటి రోజు నుంచి చెబుతోంది.
ఈ విధానానికి అధికారికంగా ‘నైబర్హుడ్ ఫస్ట్’ లేదా ‘పొరుగుదేశాలకు మొదటి ప్రాధాన్యత’ అని పేరు పెట్టారు.
గత దశాబ్ద కాలంగా దిల్లీలోని ప్రభుత్వ మంత్రులు లేదా విధాన నిర్ణేతలు నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి మూలం ఇదే అని పదే పదే చెబుతున్నారు.
‘నైబర్హుడ్ ఫస్ట్’ ప్రధాన సారాంశం ఏమిటంటే, భౌగోళికంగా భారత్కు దూరంగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాసియాలోని తన పొరుగు దేశాలతో (శ్రీలంక, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ మొదలైన వాటితో) సంబంధాలకు, ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరులో ఇది ప్రతిబింబిస్తోందా?
దిల్లీ తరచూ పాశ్చాత్య దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వెళుతోంది. మరోవైపు చైనా విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది.