ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
గతంలో విచారణ సందర్భంగా అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా పలు చోట్ల ఇంకా తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇవాళ ఏకంగా ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్న సుప్రీంకోర్టు.. దీనిపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖతో పాటు పోలీసులకూ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్ధాయిలో పోలీసు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీలు ఎప్పటికప్పుడు అక్రమ ఇసుక మైనింగ్ పై ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఏపీలో ఇసుక తవ్వకాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనిసుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలకు వెనుకాడవద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. జూన్ 9లోపు తమ ఆదేశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.