తిరుపతి రైల్వే జంక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా కడప-విశాఖ-కడప(తిరుమల ఎక్స్ప్రెస్ (17487/17488)) రాకపోకల్లో భారీ మార్పులు..
తిరుపతి రైల్వే జంక్షన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా కడప-విశాఖ-కడప(తిరుమల ఎక్స్ప్రెస్ (17487/17488)) రాకపోకల్లో భారీ మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి రేణిగుంట మీదుగా తిరుపతి వచ్చి.. ఆ తర్వాత కడపకు చేరుకునేది ఈ ఎక్స్ప్రెస్. అయితే ఇకపై నెల రోజుల పాటు ఈ ట్రైన్ షెడ్యూల్ మారనుంది. ఒక నెల పాటు అనగా జూలై 11 నుంచి ఆగష్టు 10 వరకు తిరుమల ఎక్స్ప్రెస్ సర్వీసులు తిరుపతి, కడప స్టేషన్లకు పాక్షికంగా బంద్ కానున్నాయి.
తిరుమల ఎక్స్ప్రెస్ సేవలు కడప నుంచి రేణిగుంట మీదుగా విశాఖపట్నానికి వెళుతుంది. అయితే కడప-విశాఖపట్టణం (17487), విశాఖపట్టణం-కడప (17488) ఈ రైలు ఆయా తేదీల మధ్యలో వైజాగ్ టూ రేణిగుంట.. తిరిగి అక్కడి నుంచే విశాఖకు రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని వలన తిరుపతికి వచ్చి వెళ్ళే భక్తులు కూడా నానా తంటాలు పడాల్సింది వస్తోంది.