దేశంలో మరో మంకీ పాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైంది. యూఏఈ నుంచి వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇది దేశంలో నమోదైన రెండో కేసు కావడం గమనార్హం.
కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఈ కేసు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడు ఇప్పటికే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. 38 యేళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణలు కనిపించడంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించగా, పాజిటివ్‌గా తేలినట్టు చెప్పారు.విదేశాల నుంచి వచ్చే వారితో సహా ఏవైనా లక్షణాలు ఉన్నవారు తమకు సమాచారం అందించి, సాధ్యమైనంత త్వరగా చికిత్సను పొందాలని సూచించారు. యూఏఈ నుంచి వచ్చిన సదరు వ్యక్తి కూడా తనకు వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించాడని, అతను తన కుటుంబానికి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు. ఆయన ప్రస్తుతం మంజేరిల వైద్య కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య మంత్రి వెల్లడించారు.