
– వర్చువల్ సమావేశంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. కల్యాణోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 3న జరిగే కల్యాణోత్సవానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, రద్దీ క్రమబద్దీకరణకు నిఘా, భద్రతా సిబ్బందితోపాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, వైద్య బృందాలను నియమించాలని కోరారు. ఈ ఉత్సవాల్లో వినియోగించే వాహనాలు, రథం పటిష్టతను ముందస్తుగా పరిశీలించాలన్నారు. చక్రస్నానం కోసం పుష్కరిణిలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు.అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో మార్చి 4 నుండి 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.వర్చువల్ సమావేశంలో విజయవాడ డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, డెప్యూటీ ఈవో(జనరల్) శ్రీ గుణభూషణ్రెడ్డి, విజివో శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.