జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.
మచిలీపట్నం అక్టోబర్ 4 ఆంధ్ర పత్రిక.
జిల్లాను రక్తహీనత రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విద్యాధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి బాలికల్లో రక్తహీనత అధిగమించుట, స్థూల నమోదు నిష్పత్తి (జిఈఆర్ )సర్వే సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో సేకరించిన నివేదికల ప్రకారం జిల్లాలో వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 23 వేల మంది బాలికల్లో రక్తహీనత సమస్య ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సిద్ధం చేసిన కార్యచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు.
ఇందులో భాగంగా తొలుత గురువారం బాలికలకు రక్త పరీక్షలు చేసి రక్తహీనత ఉన్న వారిని గుర్తించాలన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, ఉపాధ్యాయులు రక్తహీనత ఉన్న బాలికలను దత్తత తీసుకొని వారు ప్రతిరోజు మధ్యాహ్న భోజనంతోపాటు ఐరన్ మాత్రలు తీసుకునేలా బాధ్యతలు అప్పగించాలన్నారు.
పాఠశాలకు రాని రోజుల్లో కూడా వారు బాలికలు ఇంటి వద్దనే ఐరన్ మాత్రలు మింగారా లేదా అనే విషయం సంబంధిత ఉపాధ్యాయులు లెక్చరర్లు బాలికల తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలన్నారు.
ఏఎన్ఎంలు 15 రోజులకు ఒకసారి బాలికలకు రక్త పరీక్షలు చేయాలన్నారు.
ప్రతి విద్యా సంస్థలో సంబంధిత ప్రిన్సిపాల్ లేదా ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.
ప్రతినెలా అన్ని విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రక్తహీనత వల్ల కలిగే దుష్పరిణామాలు ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించాలన్నారు.
ఇందుకోసం మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయాలన్నారు.
ముఖ్యంగా మొదట ఉపాధ్యాయులందరికీ ఆరోగ్యపరమైన అంశాలపై సరైన అవగాహన కలిగించాలన్నారు.
ఆ తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆరోగ్యపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
తక్కువ ధరలో పొందగలిగే పుష్టికరమైన ఆహారం గురించి కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.
ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు రక్తహీనత ఉన్న బాలికల పట్ల జవాబుదారితనంతో వ్యవహరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులను కూడా భాగస్వాములను చేసి బాలికల్లో ఉత్తేజాన్ని నింపాలన్నారు.
బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం పెంపుదలకు ప్రాధాన్యతనిస్తూ ప్రశంసా పత్రాలను అందజేసి ప్రోత్సహించాలన్నారు.
ప్రతిరోజు జరిగే ప్రార్థన కార్యక్రమంలో కూడా రక్తహీనత వల్ల కలిగే దుష్పరిణామాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 98.69% స్థూల నమోదు నిష్పత్తిని సాధించామన్నారు.
జిల్లాలో నూటికి నూరు శాతం బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించే దిశగా ఒక సమగ్ర యాప్ను సిద్ధం చేయాలన్నారు.
ఆ యాప్ ను సిఆర్పి లకు ఇచ్చి డౌన్లోడ్ చేయించి ఒక్కొక్కరికి నాలుగు గ్రామాల చొప్పున అప్పగించి ఏఏ పిల్లలు ఏయే పాఠశాలలు, కళాశాలల్లో చదువుచున్నారా లేదా ఆ వివరాలను సేకరించాలన్నారు.
దీంతో జి ఈఆర్ ఫై స్వచ్ఛమైన వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
పదవ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులుకాని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వారికి కావలసిన విద్యాసామగ్రిని అందజేసి వారికి చదువు చెప్పాలని, వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాలన్నారు. దీంతో వారిలో ఆత్మస్థైర్యం పెంపొంది రాబోయే వార్షిక పరీక్షలు బాగా రాసే అవకాశం ఉందన్నారు.
ఈ అంశాలను సంబంధిత మండల విద్యాధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
ఈ సమావేశంలో డిఇఓ తాహేరా సుల్తానా, డివైఈవోలు యు.వి. సుబ్బారావు, పద్మారాణి, డివిఈవో ప్రసాద్,జిల్లా సైన్స్ అధికారి జాకీర్ హుస్సేన్ పలువురు ఎంఈఓ లు పాల్గొన్నారు.