గత రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో చిన్నపాటి వర్షం కురిసింది. ఈ వర్షాలకి భూమిలో ఉన్న వజ్రపురాళ్లు పైకి తేలి మెరుస్తూ ఉంటాయి. జొన్నగిరి గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీకి వజ్రం దొరకడంతో స్థానిక వజ్రాల వ్యాపారిని ఆశ్రయించింది. ఈ వజ్రాన్ని 10 లక్షల నగదు ఐదు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం.
దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే.. అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం.. అయితే దీపావళి కంటే ముందే ఓ మహిళను లక్ష్మీదేవి అనుగ్రహించింది. వ్యవసాయ మహిళా కూలి ఉన్నట్లుండి రాత్రికి రాత్రి లక్షాధికారి అయింది. అదృష్ట లక్ష్మి ఆమె తలుపు తట్టింది. పొలంలో కూలి పని చేస్తుండగా వజ్రం దొరకడంతో ఆ మహిళ జీవితమే మారిపోయింది.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో తరచుగా వజ్రాలు దొరుకుతున్నాయి. వర్షం పడిందంటే చాలు వజ్రా అన్వేషణ కోసం వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుంటారు. అయితే అదృష్టం కొందరిని వరిస్తుంది.. కొందరికి మాత్రమే వజ్రాలు దొరుకుతున్నాయి. కాకపోతే దాని క్యారెట్ విలువను బట్టి కొందరికి లక్షలు మరికొందరికి కోట్లు కూడా వస్తున్నాయి. ఈ గ్రామానికి సమీపంలోని కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే పెరవలి అనే గ్రామంలో వజ్రాల వ్యాపారులు ఉన్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమకు దొరికిన రాయిని ఈ వ్యాపారుల దగ్గరికి తీసుకెళ్తే అది వజ్రమా కాదా అని ధ్రువీకరిస్తారు. దీని రేటు కూడా నిర్ణయిస్తారు. కొంత నగదు కొంత బంగారం ఇచ్చి కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేయడంలోనే అసలు మతలబు ఉంది. వజ్రాలపై అవగాహన ఉన్నవారు మాత్రం అంతకురెండింతలు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. అవగాహన లేని వారు మాత్రం స్థానికులకే విక్రయిస్తున్నారు.
గత రెండు రోజులుగా కర్నూలు జిల్లాలో చిన్నపాటి వర్షం కురిసింది. ఈ వర్షాలకి భూమిలో ఉన్న వజ్రపురాళ్లు పైకి తేలి మెరుస్తూ ఉంటాయి. జొన్నగిరి గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీకి వజ్రం దొరకడంతో స్థానిక వజ్రాల వ్యాపారిని ఆశ్రయించింది. ఈ వజ్రాన్ని 10 లక్షల నగదు ఐదు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే అధికారులు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో వజ్రం దొరికిన విషయం ఎవరూ బయటకు చెప్పరు. ఇదే తంతు గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తోంది.
జొన్నగిరి గ్రామంలోని కొన్ని పొలాల్లో రాళ్లు వజ్రాలు పోలి ఉంటాయి. పొలంలోని మొత్తం రాళ్లన్నీ కూడా వజ్రాలే అనే విధంగా ఉంటాయి. రాళ్లలో కొన్ని వజ్రాలు కలిసి ఉంటాయి. మిగతా రాళ్ల కంటే ఎక్కువగా మెరుస్తూ ఉండటం నులుపుగా ఉండటం గమనించి వ్యాపారుల దగ్గరికి తీసుకెళ్తారు. అలాగే చేసిన వ్యవసాయ మహిళా కూలికి దొరికింది వజ్రమే అని నిర్ధారణ కావడంతో .. ఆ మహిళ సంతోషానికి అవధులు లేవు.