పరిశ్రమ పెడతామంటూ వచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీకి షాక్ ఇచ్చారు పుంగనూరు ప్రజలు. తమ గ్రామాల్లో ఆ పరిశ్రమను ఏర్పాటు చేయకూడదంటూ నిరసనలు చేపట్టారు. గోపిశెట్టిపల్లె గ్రామస్తులు ఆందోళన బాట పట్టడంతో.. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 4,640 కోట్ల రూపాయలతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ యూనిట్‌ను ఈ ప్రాంతంలో నిర్మించడానికి పెప్పర్ కంపెనీ ముందుకువచ్చింది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ కంపెనీకి షాక్ ఇచ్చారు స్థానిక గ్రామస్తులు. పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లె సమీపంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ పరిశ్రమ రానుంది. జర్మనీకి చెందిన పెప్పర్ ఎలక్ట్రిక్ బస్, ట్రక్కుల తయారీ పరిశ్రమ.. ఈ గ్రామ సమీపంలో తమ ఇండస్ట్రియల్ యూనిట్లను నెలకొల్పే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా తొలిసారిగా ఈ గ్రామాలను కంపెనీ టీమ్ సందర్శించింది. అయితే పుంగనూరు మండలంలోని మూడు గ్రామాల ప్రజలు ఈ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ కంపెనీని ఇక్కడ నెలకొల్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.
తాజాగా ఈ పరిశ్రమ రాకను వ్యతిరేకిస్తూ గోపిశెట్టిపల్లె గ్రామస్తులు ఆందోళన బాట పట్టడంతో.. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు అంతా రోడ్ల మీదకు రావడంతో వాళ్లను కట్టడి చేయడానికి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. గోపిశెట్టి పల్లె వాసులు మొదటినుంచి, పెప్పర్ ఎలక్ట్రిక్ బస్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఎంపీడీఓ ఆఫీసులో కలెక్టర్, పెప్పర్ ఎలక్ట్రిక్ బస్ కంపెనీ టీమ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి.
4,640 కోట్ల రూపాయలతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ యూనిట్‌ను ఈ ప్రాంతంలో నిర్మించడానికి పెప్పర్ కంపెనీ ముందుకువచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ గ్రామస్తులను ఒప్పించి అందరి ఆమోదంతోనే కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు. గామస్తులందరికి పరిహారం చెల్లించి వారి ఆమోదంతో ఇండస్ట్రియల్ యూనిట్‌ను ప్రారంభిస్తామన్నారు కలెక్టర్. ఈ కంపెనీ ప్రారంభంతో ఈ ప్రాంతం చాలా అభివృద్ధిలోకి వస్తుందంటూ గ్రామస్తులకు ఆయన హితవు చెప్పారు.
సద్భావంతో ఆలోచించి ముందుకు రండి, సమస్యలు ఉంటే నేరుగా తనను కానీ, ఆర్డీని కలవాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. ఇక పెప్పర్ కంపెనీ సీఈవో ఆండ్రియాస్ మాట్లాడుతూ తమ కంపెనీ కాలుష్య రహితమైన బస్సులు, ట్రక్కులను తయారు చేస్తోందని, గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు.