చంద్రబాబు కేసులో పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. బాబును ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జగన్ సర్కార్ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై అక్టోబర్ 3న సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసలు కేవియట్ పిటిషన్ అంటే ఏంటి ? దీనివల్ల చంద్రబాబుకు వచ్చే ఇబ్బందులేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులోనూ..అటు హైకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు అక్రమంగా రిమాండ్ విధించారని.. రిమాండ్ పిటిషన్ను కొట్టివేయాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చేముందు తమ వాదనలు వినాలని కేవియట్ పిటిషన్లో ప్రభుత్వం కోరింది. తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులకు శిక్షణ పేరుతో నిధులను దారి మళ్లించారని.. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని సీఐడీ అభియోగాలు మోపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని.. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ కేసులో కేవియేట్ పిటిషన్ను విచారిస్తే తమ వాదన కోర్టు ముందుంచుతామని ఏపీ సర్కార్.. కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
సెక్షన్-148 (ఏ) సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. కేవియట్ పిటిషన్ వేసిన వారు అవతల పార్టీకి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కోర్టు.. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలిస్తుంది. తదనుగుణంగా విచారణ చేసి ఇవ్వాల్సిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. కేవియట్ పిటిషన్ వ్యవధి 90 రోజులు ఉంటుంది. దిగువ న్యాయస్థానం తీర్పు వెలువడిన తేదీ నుండి వీలైనంత త్వరగా పైకోర్టులో కేవియట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తద్వారా సంబంధిత కేసులో పైకోర్టు ఓ నిర్ణయం తీసుకునే ముందు కేవియేటర్ తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ 03న అటు చంద్రబాబు తరఫున లాయర్లు.. ఇటు ప్రభుత్వం తరఫున సీఐడీ తరఫున లాయర్లు సుదీర్ఘంగా వాదనలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వాదనల తర్వాతే సుప్రీంకోర్టు తన తీర్పును ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మరికొన్నిరోజులు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబుపై స్కిల్స్కామ్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, అంగళ్లు ఘర్షణకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టులో శుభవార్త వస్తుందని ఆశిస్తున్న టీడీపీ శ్రేణులకు..ప్రభుత్వం దాఖలు చేసిన కేవియట్ పిటిషన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరి దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.