అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించాయి. ఈ ఆరోపణలను రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ సవాల్ ను కేటీఆర్ స్వీకరించారు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన గులాబీ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టాయి.
కేటీఆర్ చేసిన ఆరోపణలు ఏంటి?
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.. అమృత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం 1500 కోట్లు కేటాయిస్తే ఇందులో 8,888 కోట్లను తన బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. అర్హత లేకున్నా సృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఎలా దక్కిందని ఆయన ప్రశ్నించారు. 2 కోట్ల లాభాలున్న కంపెనీ 1000 కోట్ల విలువైన పనులు ఎలా చేస్తోందని ఆయన అడిగారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఇండియన్ శోధ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో జాయింట్ వెంచర్ చేయడానికి ఒత్తిడి చేశారు. ఇందులో ఇండియన్ హ్యుమ్ పైప్ కంపెనీకి 20 శాతం, శోధ కంపెనీ 80 శాతం పనులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఎవరీ సృజన్ రెడ్డి?
సూదిని సృజన్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చిన్నఅల్లుడు. మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి సోదరులు మనోహార్ రెడ్డి కొడుకే సృజన్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేటీఆర్ ఆరోపణలపై మండిపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఆరోపణలను రుజువు చేసిన గంట లోపుగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.ఈ ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన కేటీఆర్ ను కోరారు.
సవాల్ కు సై అన్న కేటీఆర్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ ను కేటీఆర్ స్వీకరించారు. అమృత్ టెండర్లలో అవినీతిపై తాను చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. సిట్టింగ్ జడ్జి నియామకం కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసేందుకు రావాలని ఆయన మంత్రిని కోరారు. ఒకవేళ హైకోర్టు సీజేను కలిసేందుకు ఇబ్బంది ఉంటే కేంద్ర విజిలెన్స్ శాఖను కలిసేందుకు రావాలని ఆయన కోరారు. ఈ విచారణలో తాను చేసిన ఆరోపణలు అబద్దమని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు.
గులాబీ పార్టీకి షాకిచ్చిన కందాల ఉపేందర్ రెడ్డి
అమృత్ టెండర్లలో బీఆర్ఎస్,కాంగ్రెస్ లు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్న తరుణంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ టెండర్లలో అవినీతే జరగలేదని చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను ఇబ్బందికి గురి చేశాయి. నిబంధనల మేరకే ఈ కాంట్రాక్టు దక్కిందని ఆయన చెప్పారు. తప్పుడు సమాచారం ఆధారంగా ఈ కేటీఆర్ అమృత్ టెండర్ల గురించి మాట్లాడి ఉంటారని ఆయన తెలిపారు.
అమృత్ టెండర్లే విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తప్పుబట్టడం చర్చకు దారి తీసింది. తప్పుడు సమాచారం ఆధారంగా కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారని చెప్పడం గులాబీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి.
నిబంధనలకు విరుద్దంగా అమృత్ పథకం టెండర్లు జరిగాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై అదే పార్టీకి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి తోసిపుచ్చారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణలను ఉపేందర్ రెడ్డి తేలికగా తీసుకున్నారు.