గుంటూరులో అనుమతుల్లేకుండా అపార్ట్మెంట్ నిర్మాణంఅన్న అధికారంతో రెచ్చిపోయిన మురళీకృష్ణ
గుంటూరు పట్టాభిపురంలో నిర్మాణంలో ఉన్న అంబటి మురళీకృష్ణకు చెందిన అపార్ట్మెంట్
అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు, వైకాపా నేత అంబటి మురళీకృష్ణ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం.. ఈ భవనం! గుంటూరులోని పట్టాభిపురం ప్రధాన రహదారి పక్కన అనుమతుల్లేకుండానే అంబరమంత ఎత్తులో వెలిసింది ఈ కట్టడం. ఖరీదైన ప్రాంతంలో 5.80 ఎకరాల్లో జీ+14 అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టిన అంబటి మురళీకృష్ణ.. వైకాపా ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ భవంతిని నిర్మించారు. ఇందులో 510 ఫ్లాట్లు ఉండగా, ప్రాజెక్టు విలువ రూ.500 కోట్లుగా అంచనా. ఎప్పటికప్పుడు ‘రివైజ్డ్ ప్లాన్’ పేరుతో అనుమతులు కోరుతూ నిర్మాణ పనులు కొనసాగించారు. అధికారులెవరూ రాకుండా కట్టడి చేశారు. వైకాపా అధికారం పోయాక.. ఇబ్బందులు ఎదురవుతాయని భావించి, పాత అధికారులు బదిలీ అయ్యేలోపే గత జులైలో ఆమోదం సాధించారు.
రైల్వే ట్రాక్‌కు సమీపంలోనే..
పట్టాభిపురంలో రైల్వే ట్రాక్‌కు సమీపంలో జీ+5 అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామంటూ రైల్వే అధికారుల నుంచి తొలుత నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) పొందారు. కానీ, అంతకుమించి నిర్మాణాలు చేపడుతున్నారని గుర్తించిన రైల్వేశాఖ..అభ్యంతరం తెలియజేస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థకు లేఖ పంపింది. దానిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ లేఖ కూడా నగరపాలక సంస్థలో కనిపించడం లేదట.
ఒకే నెలలో అభ్యంతరం.. ఆమోదం
ఈ భవనానికి కొన్ని ఫీజులు బకాయి ఉన్నాయి. సర్వీస్ రోడ్డు, ఎమినిటీస్ బ్లాక్‌లో కల్పించే సౌకర్యాలపై ప్లాన్‌లో చూపించలేదు. దీన్ని గుర్తించిన పట్టణ ప్రణాళిక అధికారులు గత జులైలో నోటీసు ఇచ్చారు. కానీ, చర్యలు తీసుకోలేదు. ‘స్టాప్ ఆర్డర్’ అమలు చేయలేదు. దీంతో నిర్మాణం యథావిధిగా సాగింది. అక్కడికి అధికారులెవరూ వెళ్లి తనిఖీ చేసిన దాఖలాల్లేవని గతంలో సీపీగా పనిచేసిన అధికారి ఒకరు తెలిపారు. నోటీసు ఇచ్చిన జులైలోనే ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం గమనార్హం. ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి 2015లో జీ+5 పేరుతో మాత్రమే అనుమతులు పొందారు. 2017లో జీ+14కు అనుమతులు కోరుతూ రివైజ్డ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2023లో మరోసారి ఒక టవర్ డిజైన్ మార్చుకుంటున్నామని రివైజ్డ్కు దరఖాస్తు చేశారు. 2023 నవంబరు, డిసెంబరులో రివైజ్డ్ ప్లాన్‌కు దరఖాస్తు చేసినా, ఆయా అనుమతుల పత్రాలను 2024 జులైలో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. దీనిపై నగర ప్రణాళికాధికారి రాంబాబు మాట్లాడుతూ ‘జీ+14కు అనుమతులు కోరుతూ 2017లోనే ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో అనుమతులిచ్చాం. నిర్మాణాలను బుధవారం పరిశీలించాం. గతంలో మేం తెలిపిన అభ్యంతరాలను నిర్మాణదారు పరిష్కరించారా, లేదా? ఫీజు ఎంత బకాయి ఉంది? ఏయే అనుమతులు తీసుకున్నారు? వంటివి పరిశీలిస్తున్నాం. రైల్వే లేఖ కనిపించటం లేదు. నకలు తీసుకుని ఆ అభ్యంతరాన్నీ పరిశీలిస్తామ’ని వివరించారు.
బజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్యానికి.. మురళి బెదిరింపులు: ధూళిపాళ్ల
విలేకరులతో మాట్లాడుతున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్
అమరావతి, పట్టాభిపురం : వైకాపా నేత అంబటి మురళీకృష్ణ బజరంగ్ జూట్‌మిల్లు యాజమాన్యాన్ని బెదిరించి సుమారు రూ.60-70 కోట్ల విలువైన స్థలానికి యజమాని అయ్యారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ‘జూట్‌మిల్లు స్థలాలపై 2014-19 మధ్య ఎన్నో వివాదాలుండేవి. కోర్టుల్లో కేసులున్నప్పటికీ ఆదిత్య ఇన్ఫ్రా సంస్థతో అపార్టుమెంట్ల నిర్మాణాలకు ఒప్పందం చేసుకున్నారు. మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరిన మురళీకృష్ణ.. భజరంగ్ సంస్థ యాజమాన్యాన్ని బెదిరించి డైరెక్టర్ అయ్యారు. అనేక వివాదాలు సృష్టించారు. 510 ఫ్లాట్లలో కేవలం 87 ఫ్లాట్లు మాత్రమే ఇచ్చేలా భజరంగ్ యాజమాన్యాన్ని చంపుతామని బెదిరించారు. దీనిపై పోలీసులు విచారణ జరపాలి’ అని ధూళిపాళ్ల కోరారు.