క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ముందస్తుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబటి రాయుడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు సేవలందించిన ఆయన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. కొన్నేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాయుడు.. కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన రాయుడు, ఆ వెంటనే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్లు పేర్కొన్నాడు. కాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా ముందస్తుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నాడు.సాధారణ ప్రజానీకంతో మమేకమవుతూ పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈక్రమంలోనే ఓ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షలు విరాళంగా అందించాడు. దీంతో అభిమానులు, నెటిజన్లు రాయుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న రాయుడు ముట్లూరులోని సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 5 లక్షల చెక్కును అందజేశారు. అలాగే మొత్తం పాఠశాల భవనాన్ని, మైదానాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు పునఃవైభవం తెప్పిస్తానని మాట ఇచ్చాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అంబటి రాయుడిని శాలువాతో ఘనంగా సత్కరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు రాయుడు. దీంతో ఇవి నెట్టింట వైరలవుతున్నాయి. రాయుడి గొప్ప మనసుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.