ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలియన్స్ కంపెనీ అధినేత ‘ముఖేష్ అంబానీ’ త్వరలో భారతదేశంలో మరో కొత్త బిజినెస్ ప్రారంభించనున్నట్లు సమాచారం.పెట్రోల్, ఎలక్రానిక్స్, క్లాథింగ్, టెలికాం, ఎనర్జీ వంటి మరెన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మరో రంగంపై కన్నేసింది.నివేదికల ప్రకారం, రిలయన్స్ సంస్థ త్వరలో ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో రూ. 20,000 కోట్ల టర్నోవర్‌తో ఐస్‌క్రీమ్ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు చేస్తోంది. గత సంవత్సరం గుజరాత్‌లోనే రిలయన్స్ కంపెనీ ఈ బ్రాండ్ విడుదల చేసింది, కాగా ఇప్పుడు మార్కెటింగ్ కోసం అక్కడి ఐస్‌క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
రిలయన్స్ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలోకి ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్‌లో పోటీ భారీగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ఐస్ క్రీమ్ పరిశ్రమలో ఐసిస్ క్రీమ్, స్టార్మి ఇండస్ట్రీస్, అమూల్ సంస్థలు అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కంపెనీలు రిలయన్స్‌తో పోటీ పట్టడానికి సిద్దమవ్వాల్సి ఉంటుంది.రిలయన్స్ సంస్థ కొన్ని రోజుల క్రితం డెయిరీ రంగంలోని ఆర్ఎస్ సోధి కంపెనీని కొనుగోలు చేసింది. అమూల్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఈ కంపెనీ ఐస్‌క్రీమ్ రంగంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకప్పుడు టెలికాం రంగంలో జియో పేరుతో ప్రవేశించినప్పుడు ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అలంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.