డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు
మాడుగుల,ఫిబ్రవరి04(ఆంధ్రపత్రి క): సిఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలో సత్యవరం సచివాలయం పరిధిలో రెండవ రోజయిన శనివారం జంపెన గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. శ్రీసీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గడప గడప ను సందర్శించారు. వివిధ సంక్షేమ పధకాలు ద్వారా జంపెన గ్రామంలో 789 మంది లబ్ది దారులకు నాలుగు కోట్ల18లక్షల70 వేల160 రూపాయలు ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. గ్రామానికి జె.జె.ఎం.ద్వారా రూ.72.50 లక్షలతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుతోపాటు ఎగువ ప్రాంత కాలనీ వాసులకు 20వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షితనీటి పధకంనిర్మించనున్నట్లు వెల్లడించారు. ఘాట్ రోడ్డుకిరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి రూ.20లక్షలు నిధులుమంజూరు చేశారు. వి.మాడుగులలో నూతనంగా రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని చిన్నారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. జగనన్న గృహ నిర్మాణ పధకంలో 53 మందికి ఇళ్లు మంజూరు చేశారు.ఎలిమెంటరీ స్కూల్ లో నాడు – నేడు నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు.ఎస్సి కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేశారు. ఎస్సి కాలనీలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పరిశీలించారు. గ్రామంలో ఉన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.గ్రామంలో విద్యుత్ సంబంధిత సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచనలు చేశారు.అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పౌష్ఠిక ఆహారంపై చిన్నారులను మంత్రి అడిగారు. అనంతరం వారికి తినుబండారాలు పంపిణి చేశారు.నూతన అంగన్వాడీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వినయ్ రాకేష్(9) దివ్యాంగ అర్హత గుర్తించి పింఛను వచ్చేలా దరఖాస్తు సిద్ధం చేయమని అధికారులకు సూచనలిచ్చారు. కోన గాటీలు కల్లాల దగ్గర నుండి కోన సోమునాయుడు కల్లాలకు రోడ్డు నిర్మాణం అయ్యేలా చూడాలని డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.