మచిలీపట్నం నవంబర్ 1 ఆంధ్ర పత్రిక.:
నవంబర్ 4, 5, వ తేదీలు డిసెంబర్ 2, 3 తేదీలలో ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేక శిబిరాల నిర్వహణ నిర్వహిస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు.
ప్రజల నుండి క్లైములు, ఆక్షేపణల పరిశీలన అనంతరం 2024 జనవరి 05 న తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కోరారు.
బుధవారం ఆయన తన చాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందని, జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లు, తహశీల్దార్, ఆర్డిఓ కార్యాలయాల వద్ద ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రాలలో ఫారం – 6, 7, 8 ప్రింటింగ్ ఫారాలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
అలాగే, నవంబర్ 4, 5 వ తేదీలలో డిసెంబర్ 2, 3 వ తేదీలలో ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేక శిబిరాలను పోలింగ్ బూత్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు క్యాంపెయిన్లు నిర్వహించడం జరుగుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలో ఏవైనా పొరపాట్లు, తప్పిదాలు ముద్రించబడినా, జాబితాలో ఉన్న వారు ఏవైనా మరణించినా, శాశ్వతంగా వలస వెళ్ళినా, అనర్హులైన ఓటర్ల వివరాలను సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చి తప్పిదములు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయుటలో ప్రజలు సహకరించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు కోరారు.
2023 డిసెంబర్ 26 న క్లైములు మరియు ఆక్షేపణ ల పై విచారణ పూర్తి చేయుట, 2024 జనవరి 01న డేటాబేస్ లో వివరాలను అప్ లోడ్ చేసి, 2024 జనవరి 05న తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ 2023 నుండి నవంబర్ 1 వ తేదీ వరకు ఫారం – 6 దరఖాస్తుల మొత్తం 55,744, ఫారం – 7 దరఖాస్తులు మొత్తం 45,951, ఫారం – 8 దరఖాస్తులు మొత్తం 75,537 వచ్చినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పెద్ది రోజా,ఎలెక్షన్ సెల్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ మెండు సురేష్, డిప్యూటీ తాహిసిల్దార్ ఎం.వి శ్యామనాథ్, వై. యస్.ఆర్. సి. పి. ప్రతినిధి షేక్ సలార్ దాదా, సిపిఎం పార్టీ ప్రతినిధి కొడాలి శర్మ, వై నరసింహారావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి టి.చంద్రశేఖర్, బి జే పి ప్రతినిధి పంతం గజేంద్ర, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బత్తిన దాస్ తదితరులు పాల్గొన్నారు.