‘‘మరణం నా చివరి చరణం కాదు’’, ‘‘మౌనం నా చితాభస్మం కాదు’’ అని ఎలుగెత్తి చాటిన అభ్యుదయ, ప్రగతిశీల రచయిత. అతని అక్షరం మండుతున్న కణం. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సమాజంలోని ధనిక, బీద వర్గాలను విడదీసి పేదల పక్షాన నిలబడి ధనస్వామ్యాన్ని చీల్చి చెండాడుతూ లోకం గుట్టును ధైర్యంగా తన కవితల్లో చెప్పగలిగాడు. ‘‘గుడిసెలో మేడల్ని కడతాయి/అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి’’ అంటూ వర్గ దృక్పథాన్ని వెల్లడిస్తారు. కవిత్వం సమాజహితంగా ఉండాలనేది ఆయన లక్ష్యం. అయితే కవిత్వం బువ్వ పెట్టదని అతనికి తెలుసు. అందుచేతనే స్వగ్రామమైన జగిత్యాల (తెలం గాణ)లో ‘పూర్ణిమ’ ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత కరీంనగర్‌కు తన మకాం మార్చుకొని అక్కడ స్టూడియోను నెలకొల్పాడు. పరిస్థితులు అనుకూలించక పోవడంతో చివరికి హైదరాబాదులో స్టూడియో పెట్టుకున్నాడు. తన జీవన గమ్యం, గమనాన్ని వెదుకున్నాడు అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ 1954 జనవరి 12న జన్మించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల వీరి జన్మస్థలం. తల్లి లక్ష్మమ్మ, తండ్రి చిన రాజాం. ఇతరులకు అపకారం తలపెట్టని, ఇతరుల నుంచి ఊరి కే చిల్లి గవ్వ ఆశించని స్వాభిమాన కుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే నిత్య శ్రమ ద్వారా వచ్చే ఆదాయమే ఆ కుటుంబ జీవనాధారం. అలాంటి కుటుంబలో జన్మించిన ప్రభాకర్ పెద్ద చదువులు చదివే అవకాశం లభించలేదు. పైగా బాల్యంలోనే తండ్రి మరణించారు. కుటుంబ పోషణ భారం నెత్తిన పడిరది. ఆ భారం మోస్తూనే, ఊహ తెలిసినప్పటి నుంచి ఆకతాయితన ంగా పెన్సిల్‌తో బొమ్మలు గీయటం అలవాటు చేసుకున్నారు. అదే చివరకు అతనికి ఆధారమైంది. జగిత్యాలలో పూర్ణిమ పేరిట ఒక ఫోటో స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు. బడుగు జీవుల కష్టాలు, కడగండ్లు కళ్ళారా చూడటం, ధనవంతుల ఆధిపత్యం, అహంకారం మదిలో తరచూ మెదలటంతో కలం పట్టి కవితలు రాయటం ప్రారంభించారు. వాటికి యనువైన బొమ్మలు వేయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఆయన రాసిన తొలి కవిత 1975లో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో అచ్చయింది. సాహిత్యపరుల దృష్టిని ఆకర్షించింది. వారి కవితా జీవితానికి పునాదులు వేసింది. 1976లో ‘‘ఎర్ర పావురాలు’’ అనే కవితా కాదు, విప్లవ చరిత్రలో కూడా మైలురాయిగా నిలిచింది. అటు తర్వాత ప్రభాకర్ వెనుదిరిగి చూడలేదు. కలం ఆపలేదు. కుంచెను సవరించుకుంటూ, కళాత్మక చిత్రాలు గీస్తూ ముందుకు సాగారు. 1978 నాటి జగిత్యాల జైత్రయాత్ర ప్రభాకర్ హృదయాంతరాల్లో నిక్షిప్తమై ఉన్న కవితావేశాన్ని తట్టి లేపి దిశా నిర్దేశనం చేసింది. ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. అక్షరాలతోనే సమర శంఖాన్ని పూరించి, చిన్న చిన్న పదాలతో అద్భుత విన్యాసాలు చేయిస్తూ, అన్ని సామాజిక రుగ్మతలను స్పృశిస్తూ తెలుగు కవితా ఉద్యమ కొత్త బాటకు మార్గ నిర్దేశం చేశారు. ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములతో వేగలేక కరీంనగర్‌కు తరలి వెళ్లి శిల్పి స్టూడియో నిర్వహించారు.
1982లో భార్య, ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాదుకు మకాం మార్చారు. అక్కడే స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియలుగా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాదు నగరంపై మినీ కవిత్వం రాశారు. హైదరాబాదీలు మాట్లాడే మాటలనే వాడుతూ కవితలుగా ఎక్కుపెట్టారు. ఆరు సంవత్సరాల పాటు సిటీ లైఫ్ కాలంలో రాశారు. అలిశెట్టి ప్రభాకర్ అనేది నిజానికి వ్యక్తి పేరు కాదు. అగ్ని జ్వాలామయమైన కవితా శక్తి పేరు. ఉప్పొంగే భావావేశా నికి మామూలుగా కవులు అక్షరాలను అద్దితే, అలిశెట్టి కవితకు తన చెమటను, ఆపై రక్తాన్ని అద్దారు. ఊపిరిని పణంగా పెట్టి అక్షరానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సామాజిక సమస్యలపై కలంతో పోరాడి, తన పోరాట మాధ్యమం కవిత్వమే అని భావించి, కెమెరా కన్ను… కుంచె, గన్ను.. కవాతు పెన్నుల ఏకీకరణతో కవిత కోసమే బతికారు. కవిత కోసమే ప్రాణాలిచ్చారు.
దేశంలో అవినీతి, లంచగొండితనం విశృంఖలంగా సాగుతున్న నేపథ్యంలో ‘‘పచ్చనోటు ఊపితేగాని/కదలని రైలు అన్నా/మన బతుకు ఫైలు’’ అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చిన తీరు ఎంతో బాగుంది. మానవ సమాజంలో కొనసాగుతున్న దృశ్యాన్ని ఆవిష్కరించారు.
‘‘కన్నీళ్ళను ఏ భాషలోకి అనువదించినా / విషాదం మూర్తీభవిం చిన ‘స్త్రీ’యే సాక్షాత్కరిస్తుంది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను, వివక్షతను గమనంలోకి తీసుకొని ఈ కవితలో రాశారు.
తాను అనారోగ్యంతో అల్లాడుతున్నా విప్లవకవి చెరబండ రాజుకు ఆర్థిక సాయం అందించాలని తాపత్రయపడ్డారు. తన సాయం చెరబండ రాజు ప్రాణాలు కాపాడలేకపోయినా అతని మానవ త్వానికి అగ్గిపుల్లతో/గీసినా / భగ్గుమండితే / అదేరా ఆకలి’’ అంటూ ఓ మినీ కవితను రాశారు.కవితను సూటిగా చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కవిత్వం స్పష్టంగా ఉండాలి, హత్తుకునే విధంగా ఉండాలని చెబుతారు. అందుకే ఆయన ఏం చెప్పారంటే ‘‘ఎందుకురా కవీ / గజిబిజి ఇమేజీ / అస్పష్ట కవిత కన్నా / ఆల్జీబ్రా ఈజీ’’ అని మనసులోని మాటను చెబుతారు.తొలి రోజుల్లో అతని నగర జీవితం చివరకు అది వాసనలేని జడ పదార్థంగా తెలిసిపోయింది. ఎందరికో బతుకు నిచ్చిన భాగ్యనగరం ప్రభాకరుకు మాత్రం క్షయ (టి.బి.) రోగానిచ్చింది. చనిపోతానని భయం లేకుండా అంతిమ శ్వాస విడిచే వరకు కవిత్వంతో నిప్పుల వాన కురిపించారు.కాన్వెంట్ చదువులే అసలైన చదువులని భావించే మధ్య తరగతి, బడుగు జీవుల పిల్లల బతుకులు ఎలా ఉన్నాయో చెప్పిన కవిత: ‘‘ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో పేవుమెంటుపై విరబూసిన/ కాన్వెంట్ పువ్వుల సందడి/రాలే చదువుల పుప్పొడి’’ వ్యంగ్యాన్ని, ఆర్ద్రతను సమపాళ్లలో జీవిత సమస్యల్ని విశ్లేషించడం ప్రభాకర్‌కి చెల్లింది. మనసులో నాటుకునే విధంగా కవిత్వం చెప్పడం అతని ప్రత్యేకత. కవితా లోకాన్ని తన కలం బలంతో ఉర్రూతలూగిం చిన అలిశెట్టి ప్రభాకర్ జీవించింది 39 ఏళ్ళు మాత్రమే. హైదరాబాదులో ఉంటూ కవితా వెలుగులు విరజిమ్ముతున్న కాలంలోనే క్షయ వ్యాధి దాపురించి 1993లో తాను జన్మించిన జనవరి నెలలోనే 12వ తేదీన కన్నుమూశారు.
దాసరి ఆళ్వారస్వామి
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!