పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది ఉంది.
ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడనున్నాయి.
ఇప్పటికే కోస్తాతో పాటు రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి. రాజమండ్రితో పాటు విజయవాడలో వర్షం దంచికొట్టింది.
ఉరుములు మెరుపులతో కుంభవృష్టి పడింది. కొద్దిరోజులుగా ఎండకాలం మాదిరిగా ఎండలతో అల్లాడిన జనం వర్షంతో చల్లబడ్డారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాబోయే రెండురోజుల్లో జయశంకర్ భూపాలపల్లితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోనూ వానలు పడతాయంది. హైదరాబాద్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.