నవంబరు 01, తిరుపతి 2022: రామాయణ, భారత, భాగవత గ్రంథాల పునర్ముద్రణకు చర్యలు తీసుకుంటామని టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. మంగళవారం ఆమె ప్రెస్, పబ్లికేషన్స్, సేల్స్వింగ్, సప్తగిరి మాసపత్రిక కార్యాలయాలను పరిశీలించారు. ప్రెస్ ఆధునీకరణ, సేల్స్ వింగ్ బలోపేతం, సప్తగిరి మాసపత్రిక మరింతగా ఆకట్టుకునేలా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై అధికారులతో సమీక్షించారు.
అనంతరం జెఈవో మాట్లాడుతూ ప్రెస్‌ను రాబోయే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యంత్రాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వారం రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. పబ్లికేషన్ విభాగాన్ని బలోపేతం చేసి సనాతన హిందూ ధార్మిక ప్రచారానికి సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలు, పురాణాలను ప్రజోపయోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.
జెఈవో వెంట డిఎఫ్వో శ్రీ శ్రీనివాస్, చీఫ్ ఎడిటర్ డా.రాధారమణ, ఎడిటర్ డా.చొక్కలింగం, ప్రెస్ ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి ఆచార్య రేమిళ్ల వెంకటకృష్ణశాస్త్రి, డిఇవో శ్రీ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.