మునగపాక.: శివరాత్రికి శివుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. పరమ శివునికి ప్రీతిపాత్రమైన రోజు కా కావడంతో శివరాత్రి రోజున శివుని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి శివరాత్రి రోజున దర్శించుకునే శివాలయాలకు ప్రత్యేకతలు ఉంటే మరింత నమ్మకంగా ఉంటుంది. ఇలాంటి నమ్మకాలు ఉన్న దేవాలయాల్లో మునగపాక మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల నీలకంఠేశ్వరస్వామి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నెలకొల్పిన శివలింగం స్వయంభుగా వెలసింది కావడం, ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉండడం మరో ప్రత్యేకత. శివరాత్రి రోజున శివుని నిజరూపంగా శివలింగాన్ని దర్శనం కలిగిస్తారు. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. వెంకటాపురంలో చెరువు తవ్వకం పనులు చేస్తుండగా, శివలింగం బయటపడిందని ఆ శివలింగాన్ని తీసుకువచ్చి రామాలయం పక్క నుంచి పూజలు చేసుకునే వారని చెబుతుంటారు. శివలింగానికి ప్రత్యేకంగా పూజలు చేయాలనే ఉద్దేశంతో సమీపంలోనే శివలింగాన్ని ఏర్పాటు చేసి అక్కడ పురిపాక నిర్మించారు. కొద్దిరోజులు పోయిన తర్వాత శివలింగానికి ఆలయం ఏర్పాటు చేద్దామని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి వద్ద విరాళాలు సేకరించకుండా, స్వయంగా ఇస్తే తీసుకొని ఆలియాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. శివుని మహత్యం తో పనులన్నీ చక చక గా జరిగిపోయి ఆలయ నిర్మాణం వేగవంతమైంది. వేద పండితుల సలహాతో ఈ ఆలయం నాలుగు ముఖద్వారాలతో ఏర్పాటు చేశారు. నాలుగు ముఖ ద్వారాలు ఉన్న ఆలయాలు బహు అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో వెంకటాపురంలో గల నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఒకటి కావడంతో ఈ ఆలయానికి మరింత ప్రత్యేక ఏర్పడింది.ఈ ఆలయం గత ఏడాది నవంబర్ 9న ప్రారంభం అయ్యింది. ఈ సందర్బంగా నాలుగు ముఖద్వారాలను చూసి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఎంతో పరవశించి పోయారు. ఇలాంటి నాలుగు ద్వారాలతో ఆలయనిర్మాణం బహు ఆరుదన్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డెడ ప్రసాద్, తేజా బాబు కూడా ఈ ఆలయనిర్మాణాన్ని అభినందించారు. ఈ ఆలయ నిర్మాణానికి నిర్మాణ కర్తగా సర్పంచ్ సుందరపు తాతాజీ, మాజీ సర్పంచ్ సుందరపు వెంకట కనక అప్పారావు వీఆర్వోల సంఘం రాష్ట్ర కోశాధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని వారిని ఆకాంక్షించారు.శివరాత్రి రోజున శివలింగం నిజరూప దర్శనం చేయడం కోసం శివునికి అలంకరించిన అలంకరణలన్ని తొలగించి తెల్లవారుజాము మూడు గంటల నుండి సూర్యోదయం అయ్యే ఆరు గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శివలింగానికి పూజలు చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని ఈ సమీప ప్రాంతాల ప్రజల నమ్మకం. దీంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి రోజున భారిగా అన్న సమారాధన కూడా నిర్వహిస్తారు. సాంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు తలపెట్టారు.