దిల్లీ: అధికార పీఠాన్ని కోల్పోయిన శివసేనకు మునుముందు మరిన్ని అగ్నిపరీక్షలు తప్పేలా లేవు! రాజకీయంగా ఆ పార్టీ కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన 56 ఏళ్ల చరిత్రలో శివసేన చాలా తిరుగుబాట్లు చూసింది. వాటివల్ల ఛగన్ భుజ్బల్, నారాయణ్ రాణే, రాజ్ ఠాక్రే వంటి కీలక నేతలు పార్టీని వీడారు. కానీ శిందే బృందం కొట్టిన దెబ్బ చాలా గట్టిది. తాజా తిరుగుబాటుతో ఏకంగా ఉద్ధవ్ సర్కారు కూలిపోయింది. ఇకపై సీఎంగా శిందే మరింత మంది శివసైనికులను తన వైపు లాక్కొని.. శివసేనను బలహీనపర్చే అవకాశముంది. పార్టీకి గట్టి పట్టుండే ఠాణే, కొంకణ్, మరాఠ్వాడా ప్రాంతాల్లో ప్రస్తుత చీలికతో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయిందని మహా వికాస్ ఆఘాడీ (ఎంవీయే) నేత ఒకరు చెప్పుకొచ్చారు.
గతంలో భుజ్బల్, నారాయణ్ రాణే తిరుగుబాటు చేసినప్పుడు మహారాష్ట్రలో శివసైనికులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తదుపరి ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు ఓడిపోయేలా చేశారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. శిందే వర్గం తిరుగుబాటుపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. మరోవైపు- భాజపా 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, హిందుత్వ గళానికి ఏకైక ప్రతినిధిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని.. అప్పుడే శివసేన ప్రాబల్యం క్రమేణా తగ్గడం ఖాయమైందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ‘హిందుత్వ’ విషయంలో సేన కంటే కమలదళం చాలా ముందుకెళ్లిందని వారు చెబుతున్నారు. అయితే- శివసేన మళ్లీ పుంజుకునే అవకాశాలను ఇప్పుడే పూర్తిగా కొట్టిపారేయడం సరికాదని మరికొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీఎం పదవికి రాజీనామా ప్రకటించే సమయంలో ఉద్ధవ్ చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాన్ని- పార్టీని మళ్లీ పటిష్ఠంగా తీర్చిదిద్దే దిశగా పడిన తొలి అడుగుగా వారు చెబుతున్నారు. బాల్ ఠాక్రే వారసుడు ఉద్ధవేనని ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిందని గుర్తుచేస్తున్నారు. అది ఆయనకు కలిసొస్తుందని జోస్యం చెబుతున్నారు.